వైసీపీకి మ‌రో షాక్‌.. కీల‌క నేత‌లు ఔట్‌

తాజా ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం.. క‌నీ వినీ ఎరుగ‌ని ఓట‌మిని మూట‌గ‌ట్టుకున్న వైసీపీకి షాకులు ప్రారంభ‌మ‌య్యాయి. ఒక‌వైపు కూట‌మి ప్ర‌భుత్వం ఇంకా కొలువు తీర‌కుండానే.. అవినీతి.. అక్ర‌మాలు.. తీసుకున్న వివాదాస్ప‌ద నిర్ణ‌యాల‌పై శోధ‌న ప్రారంభ‌మైంది. ప్ర‌జ‌ల్లో వేడి త‌గ్గ‌క ముందే.. వైసీపీని మ‌రింత దోషిగా నిల‌బెట్టేందుకు ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. ఇప్పుడు క‌నుక వైసీపీపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకున్నా ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ‌చ్చే అవ‌కాశం లేదు.

దీంతో కూట‌మి స‌ర్కారు ఇంకా ప్ర‌మాణ స్వీకారం చేయ‌క‌ముందే.. మ‌ద్యం కుంభ‌కోణం, ఇసుక కుంభ‌కోణం.. ఫైబర్ గ్రిడ్ వంటి కీల‌క నిర్ణ‌యాల‌పై.. విచార‌ణ‌కు కూట‌మి రెడీ అయింది. ఇది వైసీపీకి భారీ షాకిచ్చే అవ‌కాశం ఉంది. మ‌రోవైపు.. ఎన్నిక‌ల్లో పార్టీఓట‌మి దెబ్బ‌తో ఇక‌, వైసీపీలో ఉన్నా ప్ర‌యోజ‌నం లేద‌ని భావించిన నాయ‌కులు పార్టీకి దూర‌మ‌వుతున్నాయి. వీరిలో ప‌దుల సంఖ్య‌లో నాయ‌కులు ఉన్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌ధానంగా.. మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు తాజాగా వైసీపీకి రాజీనామా చేశారు.

ఆయ‌న టీడీపీలో చేరేందుకు మార్గం సుగ‌మం చేసుకుంటున్న‌ట్టు స‌మాచారం. అయితే.. ఆయ‌న‌ను పార్టీ లోకి తీసుకుంటారా? లేదా? అనేది ఆస‌క్తిగా మారింది. ఇక‌, సీమ‌కు చెందిన రెడ్డి నాయ‌కులు కూడా.. పార్టీకి దూర‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌కు చెందిన వారు కూడా.. త‌మ ప్ర‌య‌త్న‌లు తాము చేసుకుంటున్నారు.

వైసీపీలో ఉంటే.. ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని గుర్తించిన వారు ఎవ‌రికి వారు.. పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. శుక్ర‌వారం నుంచి మొద‌లు పెట్టి.. కూటమి ప్ర‌మాణ స్వీకారం చేసే నాటికి.. మెజారిటీ నాయ‌కులు బ‌య‌ట‌కు వ‌చ్చేస్తార‌ని తెలుస్తోంది. ఇదే జ‌రిగితే.. వైసీపీకి మ‌రింత ఇబ్బందులు పెర‌గ‌డం ఖాయ‌మని అంటున్నారు పరిశీల‌కులు.