కూటమి అధికారంలోకి రావడంతోనే కూటమి నేత.. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంకా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకుండానే..సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిజాయితీకి నిలువెత్తు పీట వేశారు. రాష్ట్ర సర్కారుకు కళ్లు, చెవులు అనదగిన కీలక పోస్టు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. ఈ పోస్టులో నిజాయితీ అధి కారిగా పేరు తెచ్చుకున్న బిహార్‌కు చెందిన నీరబ్‌కుమార్ ప్రసాద్‌ను అప్పాయింట్ చేశారు. గురువారం సాయంత్రమే అప్పటి వరకు ఉన్న సీఎస్.. జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లిపోయారు.
ఆయనను సెలవుపై వెళ్లాల్సిందిగా.. చంద్రబాబు సూచించినట్టు వార్తలు వచ్చాయి. దీంతో ఆయన సెలవుపై వెళ్లిపోయారు. ఈ నెల 30న జవహర్‌రెడ్డి రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలోనే సీనియర్ ఐఏఎస్ అధికారి, తన 30 సంవత్సరాల సర్వీసులో అవినీతి ఆరోపణలు సహా ఎలాంటి మరకలు లేని.. నీరబ్ కుమార్ ప్రసాద్‌ను చంద్రబాబు ఎంచుకున్నారు. దీంతో సిఎస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్ శుక్రవారం ఉదయం 12 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. వెలగపూడిలోని సచివాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు.
తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు, విజయవాడ దుర్గమ్మ ఆలయం, శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం వేద పండితుల ఆశీర్వచనాల మధ్య సిఎస్ గా నీరబ్‌కుమార్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ఈకార్యక్రమంలో జిఏడి కార్యదర్శి సురేశ్ కుమార్, స్పెషల్ సిఎస్ గోపాల కృష్ణ ద్వివేది,పిసిసిఎఫ్ వై.మధుసూదన్ రెడ్డి,ఐటి కార్యదర్శి కె.శశిధర్, సర్వీసెస్ శాఖ కార్యదర్శి పి.భాస్కర్, కార్యదర్శి శ్రీధర్ తదితర శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు.
ఇదిలావుంటే.. చంద్రబాబు నిర్ణయంపై అన్ని పార్టీల నాయకులు.. అధికారులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నీరబ్ వంటి ఉత్తమ అధికారికి మంచి స్థానం ఇవ్వడంతోపాటు.. పగ్గాలు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates