కొత్త చంద్రబాబు- అప్పలనాయుడూ ఫ్లైట్ టికెట్ ఉందా ?!

“అప్పలనాయుడూ ఫ్లైట్ టికెట్ ఉందా ? తీసుకున్నావా ? లేదా ? లేదంటే మన వాళ్లు బుక్ చేస్తారు” అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విజయనగరం ఎంపీగా గెలిచిన కలిశెట్టి అప్పలనాయుడు అడగడంతో ఒక్కసారిగా అప్పలనాయుడు భావోద్వేగానికి గురికావడం జరిగింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ తొలి సమావేశం జరిగింది. అందుబాటులో ఉన్న ఎంపీలు హాజరయ్యారు. ఈ సంధర్భంగా ఈ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. స్వయంగా హాజరుకాగా దిల్లీ, ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు జూమ్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.

“అప్పలనాయుడుకు ఎంపీ టిక్కెట్ ఇస్తే చాలా మంది చాలా రకాల వ్యాఖ్యలు చేశారు. అయితే కష్టపడి పనిచేసి అందరినీ కలుపుకుని పోయి అప్పలనాయుడు గెలిచాడు. ఆర్థికంగా బలవంతుడు కాకపోయినా పార్టీలో ఉన్న సామాన్యులకు టిక్కెట్లు వస్తాయి అనడానికి అప్పలనాయుడు ఒక ఉదాహరణ అని, ఒక సామాన్యమైన కార్యకర్తకు, చిన్న నాయకులకు కూడా పార్టీలో పదవులు, అవకాశాలు కల్పించే విధంగా తన నిర్ణయాలు ఉంటున్నాయని” చంద్రబాబు నాయుడు అన్నారు.

ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఎవరూ ఆకాశంలో విహరించవద్దని, ప్రజలు నమ్మకంతో ఇచ్చిన విజయాన్ని బాధ్యతగా సమాజ సేవ చేసేందుకు వినియోగించాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలే మనందరి ప్రథమ కర్తవ్యం కావాలి. అందుకు తగ్గట్టుగానే పార్లమెంట్లో కృషి చేయాలని చంద్రబాబు పార్టీ ఎంపీలకు సూచించారు.