తాజాగా ఏపీలో జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఎవరూ ఊహించని తీర్పు.. నాయకులకు.. పార్టీలకు కూడా అంతు చిక్కని తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు తుఫానులో అతిరథ మహారథులు కొట్టుకుపోయారు. చివురు టాకులు అనుకున్న నాయకులు నిలిచి గెలిచారు. అయితే… నాయకుల పరంగా పరిస్థితి ఎలా ఉన్నప్ప టికీ.. ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేస్తారని భావించిన నాయకులు కూడా.. ఈ ఎన్నికల్లో చతికిల పడ్డారు. తమ తమ పార్టీల తరఫున బరిలో ఉన్న నాయకులను గెలిపిస్తామని కొందరు రంగంలోకి దిగారు. కానీ, వారి వ్యూహాలు ఏమాత్రం ఫలించకపోవడం గమనార్హం.
ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను పిఠాపురంలో ఓడించి తీరుతానని శపథం చేశారు.. కేంద్ర మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం. కాపులు ఎక్కువగా ఉన్న పిఠాపురంలో ముద్రగడ ప్రభావం ఎక్కువగా ఉందని అంచనా వేసుకన్న దరిమిలా.. ఆయన చేసిన శపథానికి ప్రాధాన్యం ఏర్పడింది. అంతేకాదు.. ఒకానొక సందర్భంలో ముద్రగడ.. సంచలన సవాల్ కూడా చేశారు. తానుకనుక.. పవన్‌ను ఓడించకపోతే.. తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని కూడా చెప్పారు
అయితే.. తాజాగా వచ్చిన పలితాల్లో పవన్ గెలుపు గుర్రం ఎక్కడమే కాదు.. 70 వేల పైచిలుకు ఓట్ల మెజారి టీతో విజయం దక్కించుకున్నారు. దీంతో ముద్రగడ సవాల్ చేసినమేరకు.. నిలబడతారా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో ప్రారంభమైంది. అయితే.. ఎవరూ ఆయనను ప్రశ్నించకుండానే.. ఆయనే స్పందించారు. తను చేసిన సవాల్‌కు తాను కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. అంతేకాదు. తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని అధికారికంగా ప్రకటించారు.
అంతేకాదు… వైసీపీ ఓటమిని కూడా ఆయన అంగీకరించారు. “నేను నా సవాల్‌ను నిలబెట్టుకోలేక పోయాను. పవన్ ఓడిస్తానన్న మాట విఫలమైంది. అయితే… నేను చేసిన వాగ్దానం ఏదైతే ఉందో.. దానికి కట్టుబడ్డాను. నా పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటున్నాను. ఇప్పటికే.. నా పేరును మార్చాలంటూ.. దరఖాస్తు చేసుకున్నాను. త్వరలోనే దీనికి సంబంధించి గెజిట్ పబ్లికేషన్ కూడా వస్తుంది” అని ముద్రగడ వ్యాఖ్యానించారు.