తమిళనాడులో ఇండియా కూటమి లోక్ సభ స్థానాలు అన్నింటినీ క్లీన్‌స్వీప్ చేసింది. అధికార డీఎంకే సారథ్యంలో బరిలోకి దిగిన ఆ కూటమి గత సార్వత్రిక ఎన్నికలను మించి ఫలితాలను సాధించింది. రాష్ట్రంలోని మొత్తం 39 స్థానాలను ఇండియా కూటమి కైవసం చేసుకుంది. కూటమి హవా ముందు ఏఐఏడీఎంకే, ఎన్డీయే కూటమి తేలిపోయింది.
ఆ రాష్ట్రంలోని మొత్తం 39 స్థానాలకు గానూ 22 చోట్ల గెలుపొందిన డీఎంకే తన పట్టును నిలుపుకొన్నది. ఇండియా కూటమిలోని కాంగ్రెస్ 9, సీపీఐ(ఎం) 2, వీసీకే 2, సీపీఐ 2 స్థానాల్లో గెలుపొందగా.. ఎండీఎంకే, ఐయూఎంఎల్ ఒక్కోచోట విజయం సాధించాయి. కాగా, ఏఐఏడీఎంకే ప్రభావాన్ని చూపలేదు. మరోవైపు పీఎంకేతో పొత్తు పెట్టుకొని బరిలో దిగిన బీజేపీ అనుకున్న ఫలితాలను రాబట్టలేకపోయింది.
తమిళనాడులో ఈసారి మెరుగైన ఫలితాలను పొందాలనుకున్న బీజేపీ ఆశలు ఫలించలేదు. ప్రధాని మోదీ సహా బీజేపీ హేమాహేమీలు ప్రచారం చేసినా ఫలితం లేకుండా పోయింది. కోయంబత్తూరులో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, చెన్నై సౌత్ లో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై ఓటమి పాలయ్యారు.