కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను

అయిదేళ్ళుగా ఓటమి అవమానాన్ని దిగమింగుకుని అంతకన్నా ఎక్కువ కసితో జగన్ పతనమే లక్ష్యంగా కష్టపడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి 70 వేల 354 ఓట్ల ఆధిక్యంతో వైసిపి అభ్యర్థి వంగ గీతపై విజయం సాధించడం కొత్త మైలురాయిని సృష్టించింది. ముందుగా లక్ష దాకా వస్తుందనే అంచనాలు ఉన్నప్పటికీ వివిధ సామజిక కారణాల వల్ల ఆ సంఖ్య చేరుకోలేదు. అయినా ఇది మాములు విజయం కాదు. కొందరు పది ఇరవై వేల మెజారిటీ వస్తేనే ఎక్కువనుకున్నారు. అలాంటిది ఇంత భారీ వ్యత్యాసం చూపించడాన్ని బట్టి పిఠాపురం ప్రజలు ఎంతగా పవన్ ని స్వంతం చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు.

కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ తమ అధినాయకుడు, హీరో శాసనసభలో ప్రమాణస్వీకారం చేసే ఘట్టాన్ని కనులారా చూడాలని కోరుకుంటున్న అభిమానుల కల అతి త్వరలోనే నెరవేరబోతోంది. శుభవార్త తెలియడం ఆలస్యం చిరంజీవి ఇల్లు, పవన్ స్వగృహం, మిస్టర్ బచ్చన్ షూటింగ్ స్పాట్ ఇలా పలు ప్రదేశాల్లో ఇప్పటికే సంబరాలు మొదలైపోయి ఆ వీడియోలు కూడా బయటికి వచ్చేశాయి. నాగబాబుతో పాటు మరికొందరు కుటుంబ సభ్యులు కార్యకర్తలతో కలిసి పార్టీ ఆఫీస్ లో లైవ్ లో ప్రత్యక్ష కార్యక్రమాలు చూస్తూ భావోద్వేగాలకు గురై ఆనందాన్ని పంచుకోవడం హత్తుకునేలా ఉంది.

కొన్ని నెలల క్రితం ఒక సభలో పవన్ మాట్లాడుతూ జగన్ నిన్ను అధఃపాతాళానికి తొక్కకపోతే నేను పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన కాదంటూ చేసిన శపథం మరోసారి వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. అన్నంత పని చేశావని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఒక్క చోట కూడా గెలవలేదనే ట్రోలింగ్ నుంచి దాదాపుగా క్లీన్ స్వీప్ చేసే రేంజ్ లో ఫలితాలు రాబట్టుకోవడమంటే మాటలు కాదు. టిడిపి బీజేపీతో మిత్రపక్షంగా పవన్ వ్యూహాత్మకంగా వ్యవహరించిన తీరు ఇంత గొప్ప ఫలితాన్ని అందుకునేలా చేసింది. ఇప్పుడే ఇలా ఉంటే ప్రమాణ స్వీకారం రోజున కార్యకర్తలు, అభిమానుల సంతోషాన్ని అదుపు చేయడం కష్టమే.