ఏపీలో ట్రెండ్స్ కొనసాగుతున్నాయి. గత నెల 13న జరిగిన హోరా హోరీ ఎన్నికల ఫలితం.. ఉత్కంఠగా ఉంటుందని.. నరాలు తెంపేస్తుందని అనుకున్నా.. ఆ ట్రెండ్ ఎక్కడా కనిపించలేదు. అంతేకాదు.. కనీసం ఎక్కడా వైసీపీ పోటీ కూడా ఇవ్వలేక పోయింది. మంగళవారం ఉదయం 8 గంటల తర్వాత.. ప్రారంభమైన కౌంటింగ్‌లో తొలి ట్రెండ్ టీడీపీతోనే ప్రారంభమైంది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ మోస్ట్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి లీడ్ లో కొనసాగారు.
ఇక, అక్కడి నుంచి ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. ఉదయం 11.30 నిమిషాలకే రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో కౌంటింగ్ పూర్తయిపోయింది. ఈ క్రమంలో బుచ్చయ్య చౌదరి విజయం దక్కించుకోవా లి. ఏకంగా 61 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీని ఆయన దక్కించుకున్నారు. అన్నగారు ఎన్టీఆర్ హయాం నుంచి కూడా.. టీడీపీలోనే ఉన్న బుచ్చయ్యకు ఈ సారి అసలు టికెట్ దక్కడమే సందేహంలో పడిపోయింది. జనసేన నాయకుడు.. కందుల దుర్గేష్ పోటీ ఇచ్చారు.
చివరి నిముషం వరకు తన సీటును తనకు ఇవ్వాలంటూ.. బుచ్చయ్య బ్రతిమాలుకునే పరిస్థితి.. ఒకానొక దశలో ఆయన అలిగారు కూడా. మొత్తంగా చూస్తే.. చివరకు దక్కించుకున్నారు. దక్కించుకున్నప్పుడు కూడా.. ఆయనపై ఆశలు లేవు. కానీ, ఇప్పుడు ఆయన భారీ మెజారిటీతో విజయం దక్కించుకున్నారు. అన్నగారి హయాంలో బుచ్చయ్య మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు కూడా ఆయన మంత్రివర్గ రేసులో ఉన్నారు. మరి ఆయనకు దక్కుతుందా లేదా అనేది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates