`వైఎస్సార్ సీపీ`కి రఘురామకృష్ణరాజు మరో షాక్

వైసీపీ నేతలకు, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ నేతృత్వంలో ఇటీవల జరిగిన వైసీపీ ఎంపీల వీడియో కాన్ఫరెన్స్ నుంచి రఘురామను బాయ్ కాట్ చేయడంతో ఈ వివాదం తారస్థాయికి చేరింది. ఇక, రఘురామను అనర్హుడిగా ప్రకటించాలంటూ వైసీపీ ఎంపీలు చేస్తున్న ప్రయత్నాలపై రఘురామ దీటుగా జవాబిస్తున్నారు. తన తోలు తీస్తామంటూ వైసీపీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలపై రఘురామ ఘాటుగా స్పందించారు. తన ఒంటిపై చేయి పడితే కాపాడేందుకు హేమాహేమీలున్నారని…, తోలు తీయడం తన వృత్తి కాదని, ప్రజలు అసహ్యించుకునేలా తాను మాట్లాడలేనని అన్నారు. రాయలసీమలో, పులివెందులలో కూడా తనకు స్నేహితులున్నారని, అవసరమైతే 10 వేల మందితో పులివెందులలో సభ పెట్టే సత్తా ఉందని సవాల్ చేశారు. పార్లమెంటు లోపల, బయట న్యాయ వ్యవస్థపై దాడికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. 151 ఎమ్మెల్యే సీట్లు వచ్చినంత మాత్రాన రాజ్యాంగాన్ని మార్చలేరని ఎద్దేవా చేశారు.

ఈ నేపథ్యంలోనే రఘురామ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని తన కార్యాలయం పేరును మార్పించారు. ఇప్పటి వరకు ఉన్న ‘వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ’ అనే పేరును తొలగించి ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ’ అని రఘురామ మార్చడం చర్చనీయాంశమైంది. దీంతోపాటు తన ఆఫీస్ వద్ద ఫ్లెక్సీలో ఉన్న విజయసాయిరెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఫొటోలను కూడా తొలగించారు. కాగా, రఘురామకృష్ణరాజుకు పార్టీ అధిష్టానం గతంలో ఇచ్చిన షోకాజ్ నోటీసులో వైఎస్సార్ అన్న పదం ఉండడంతో ‘వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ’ పేరు వ్యవహారంపై చర్చ మొదలైంది. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరు వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీగా చలామణీ అవుతోందని కేంద్ర ఎన్నికల సంఘానికి అన్నవైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ బాషా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై ఢిల్లీ కోర్టులో విచారణ జరుగుతోంది. తనకు షోకాజ్ ఇవ్వడంతో రెబల్ ఎంపీ రఘురామ ఈ విషయాన్ని తెరపైకి తెచ్చారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన కార్యాలయం పేరు మార్పు ప్రాధాన్యతను సంతరించుకుంది.