2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు షాక్ తప్పలేదు. ఆయన భీమవరం, గాజువాకలో పోటీ చేయగా రెండు చోట్లా ఓటమి పాలయ్యారు. కానీ ఈ సారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల్లో కూటమి జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది. పవన్ తో పాటు ఆయన అభిమానులు ఈ రెండు సీట్లపై పట్టుదలతో ఉన్నారు. ఈ సారి ఇక్కడ వైసీపీ కథ ముగిసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కచ్చితంగా గెలుస్తారనే టాక్ ఉంది.
2019 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ వేర్వేరుగా పోటీ చేశాయి. దీంతో భీమవరం, గాజువాకలో ఓట్లు చీలిపోయి వైసీపీకి ఫలితాలు కలిసొచ్చాయనే అభిప్రాయం ఉంది. ఈ సారి ఈ మూడు పార్టీలు కూటమిగా బరిలో దిగడంతో ఓట్లు చీలే అవకాశం లేదు. గాజువాకలో వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ బరిలో దిగారు. కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి పల్లా శ్రీనివాసరావు పోటీ చేశారు. ఇక్కడ ఈ ఇద్దరి లీడర్ల మధ్య టఫ్ ఫైట్ నడిచింది. అయినా ఇక్కడ పల్లా గెలుపు ఖాయమైందనే అంచనాలు వెలువడుతున్నాయి.
ఇక భీమవరంలోనూ కూటమికే జనాలు జై కొట్టారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడ పవన్‌పై వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ దాదాపు ఎనిమిది వేల మెజారిటీతో గెలిచారు. ఈ సారి కూడా ఆయన పోటీలో ఉన్నారు. కూటమి నుంచి జనసేన తరపున పులవర్తి ఆంజనేయులు సమరానికి సై అన్నారు. టీడీపీ నుంచి జనసేనలోకి మారి ఆయన పోటీలో నిలబడ్డారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన పులవర్తికి 55 వేల ఓట్లు వచ్చాయి. ఈ సారి కూటమి ఉండటంతో ఆయన గెలుపును ఎవరూ ఆపలేరనే అంటున్నారు.