మోడీ మిత్రుల్లో చంద్రబాబే బెస్ట్ అట

2014, 2019 సార్వత్రిక ఎన్నికలలో వరుసగా కేంద్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ..మిత్రపక్షాలతో కలిసి రెండు సార్లు సక్సెస్ఫుల్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే పదేళ్ల పరిపాలన పూర్తి చేసుకున్న మోడీపై కాస్త వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అయితే, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమిలో లుకలుకలు, ఇండియా కూటమికి నాయకత్వలేమి వంటి విషయాల నేపథ్యంలో ఈసారి కూడా మోడీ విజయం సాధించి హ్యాట్రిక్ కొడతారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

అయితే, బిజెపితో పొత్తు పెట్టుకున్న వివిధ రాష్ట్రాలలోని మిత్రపక్ష పార్టీలు కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధిస్తేనే ఎన్డీఏ కూటమి గెలుపు సాధ్యం అవుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఇండియా టుడే కాన్ క్లేవ్ సదస్సులో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, ఇన్వెస్టర్ రుచిర్ శర్మ సంచలన విషయాలు వెల్లడించారు. దేశవ్యాప్తంగా పలు పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకుందని, అయితే ఏపీలోని చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి మినహా మిగతా పార్టీలు రాణించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇప్పటిదాకా జరిగిన 5 దశల ఎన్నికల్లో బిహార్, కర్ణాటక, మహారాష్ట్రలలో ఎన్డీఏ భాగస్వాములైన పార్టీలు ఆశించిన స్థాయిలో రాణించలేదని, అది మోడీకి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. శర్మ వంటి రాజకీయ విశ్లేషకుల మాటలను బట్టి ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. వైఎస్ జగన్ పై ఉన్న వ్యతిరేకత, చంద్రబాబు సమర్ధత కూటమిని గెలిపిస్తుందని అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.

రాబోయే ఎన్నికల్లో బిజెపి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించే అవకాశాలు తక్కువగా ఉన్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలలో బీజేపీ మిత్రపక్ష పార్టీలు గెలిచే ఎంపీల సంఖ్య కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించనుంది. ఈ క్రమంలోనే ఏపీలో టీడీపీ, జనసేన ఎక్కువ ఎంపి స్థానాలు గెలుచుకొని అవకాశం ఉందని, తద్వారా రాష్ట్రానికి రావలసిన నిధులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నుంచి రాబట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది.