మంత్రులు సైలెంట్‌.. అన్నింటికీ రేవంత్ కౌంట‌ర్‌

కాంగ్రెస్ హైక‌మాండ్ ఎంత చెప్పినా తెలంగాణ‌లోని ఆ పార్టీకి చెందిన కొంత‌మంది మంత్రుల్లో ఎలాంటి మార్పు రావ‌డం లేద‌ని తెలిసింది. లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారంలో చురుగ్గా పాల్గొనాల‌ని, లేదంటే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హైకమాండ్ హెచ్చ‌రించింది కూడా. దీంతో ఆఖ‌ర్లో హ‌డావుడిగా ప‌రుగులు తీశారు. ఇప్పుడు ఎన్నిక‌లు పూర్త‌వ‌డంతో మ‌ళ్లీ మంత్రులు రిలాక్స్‌డ్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. దీంతో ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌ల‌కు సీఎం రేవంత్ రెడ్డి ఒక్క‌రే కౌంట‌ర్ ఇవ్వాల్సిన ప‌రిస్థితి కొన‌సాగుతూనే ఉంది.

గ‌తేడాది అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఒక్క‌డే సైన్య‌మై న‌డిచిన రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావ‌డంలో కీల‌క పాత్ర పోషించారు. ఇటీవ‌ల లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారంలోనూ ఆయ‌న తీరిక లేకుండా గ‌డిపారు. ఆ స‌మ‌యంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై, రేవంత్‌పై బీఆర్ఎస్‌, బీజేపీ తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేసింది. కానీ ఏ ఒక్క కాంగ్రెస్ మంత్రి కూడా వీటిని ఖండించిన దాఖ‌లాలు క‌నిపించ‌లేదు. కేవ‌లం భ‌ట్టి విక్ర‌మార్క‌, కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, పొంగులేటి త‌ప్ప మిగ‌తా మంత్రులూ బ‌య‌ట‌కూ రావ‌డం లేదు.

బీఆర్ఎస్ అధికారంలో ఉన్న‌ప్పుడు కేసీఆర్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు రాగానే ఆ పార్టీ మంత్రులు విలేక‌ర్ల స‌మావేశం పెట్టి మ‌రీ కౌంట‌ర్ ఇచ్చేవాళ్లు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులు మాత్రం త‌మ‌కెందుకులే అనుకుని సైలెంట్‌గా ఉంటున్నార‌ని ఆ పార్టీ వ‌ర్గాలే చ‌ర్చించుకుంటున్నాయి. ఇప్పుడు స‌న్న‌పు వ‌డ్ల‌కే రూ.500 బోన‌స్ ఇస్తామ‌ని కాంగ్రెస్ పార్టీ ప్రక‌టించ‌డంపై విప‌క్షాలు నానా హంగామా చేస్తున్నాయి. కానీ ఏ ఒక్క మంత్రి కూడా దీటుగా స్పందించ‌లేక‌పోతున్నార‌ని టాక్‌. దీనిపై కూడా రేవంత్ రెడ్డి మాత్ర‌మే స‌మాధానం ఇచ్చే ప‌రిస్థితి నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో త్వ‌ర‌లో కేబినెట్ విస్త‌ర‌ణ ఉండ‌టంతో ఈ సారి త‌న‌కు మ‌ద్ద‌తుగా నిలిచేవాళ్ల‌కు రేవంత్ ప్ర‌యారిటీ ఇచ్చే అవ‌కాశం ఉంది. అప్పుడైనా రేవంత్‌కు అండ‌గా మంత్రులు నిల‌బ‌డ‌తారేమో చూడాలి.