తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. తాజాగా ఏపీ ఎన్నికల ఫలితంపై స్పందించారు. ఇంకా ఫలితం రాకపోయినా.. ఏపీలో ఏం జరుగుతుంది? ఎవరు అధికారంలోకి వస్తారు? అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి. ఎన్డీయే కూటమి(టీడీపీ+జనసేన+బీజేపీ) అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో చెప్పిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యల అనంతరం.. కేటీఆర్‌ను తెలంగాణ మీడియా ఇదే అంశంపై ప్రశ్నించింది. దీనికి ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు. ఏపీలో జగనే మరోసారి విజయం దక్కించుకుంటారని తమకు సమాచారం ఉందన్నారు.
ఇదేసమయంలో అత్యధికంగా పోలింగ్ జరిగిందని.. ఇది ప్రభుత్వ వ్యతిరేకతకు సంకేతం కదా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి కూడా కేటీఆర్.. ఆసక్తిగా స్పందించారు. “పోలింగ్ శాతం పెరిగినంత మాత్రాన వ్యతిరేకతే అని ఎందుకు అనుకోవాలి. పాజిటివ్ కూడా కావొచ్చు కదా” అని కేటీఆర్ చెప్పారు. గతంలో కేసీఆర్ కూడా.. ఎన్నికలకు ముందు ఇలానే స్పందించారు. ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ మాట్లాడుతూ. ఏపీలో జగన్ గెలిచే అవకాశం ఉందని తమకు సమాచారం వచ్చినట్టు చెప్పారు. ఇప్పుడు కేటీఆర్ సైతం ఇదే వ్యాఖ్య చేయడం.. పోలింగ్ పర్సంటేజ్ కూడా వైసీపీకి అనుకూలంగా ఉంటుందని చెప్పడం గమనార్హం.
ఇక, కాంగ్రెస్ నేతలు.. మాత్రం ఏపీ ఫలితంపై మౌనంగా ఉన్నారు. ‘నో కామెంట్’ అని జానా రెడ్డి వంటి వారు చెప్పడం గమనార్హం. ఇదేసమయంలో కేంద్రంలో మాత్రం కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వస్తుందని జానా చెప్పారు. ఇక, ఇతర పార్టీల నాయకులు కూడా ఏపీ ఫలితంపై మౌనంగానే ఉన్నారు. మరికొందరు మాత్రం ‘ఏదైనా జరగొచ్చు’ అని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ఇక, ఎన్నికలకు ముందు మీడియాతో మాట్లాడిన జయప్రకాశ్ నారాయణ వంటి మాజీ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు కూడా.. ఇప్పుడు మౌనంగా ఉండడంతో అసలు ఏపీలో ఫలితం ఇంట ‘టైట్’గా ఉంటుందా? అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఇప్పటి వరకు ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నా.. వారికి కూడా ఎక్కడో కొన్ని సందేహాలు ఉండడం గమనార్హం.