ఏపీలో పోలింగ్ ప్రక్రియకు మరికొన్ని గంటల ముందు.. సంచలనం చోటు చేసుకుంది. కూటమి పార్టీల ముఖ్య నేత, టీడీపీ అధినేత చంద్రబాబు ఈ ఎన్నికల్లో అనేక హామీలు సంధించారు. తాము అధికారంలోకి వస్తే.. ప్రజలకు సూపర్ సిక్స్
పేరుతో సంక్షేమాన్ని అమలు చేస్తామన్నారు. వీటిలో ప్రధానంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.. మూడు సిలిండర్లు, పింఛను ను రూ.4000లకు పెంపు, 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, రైతులకు రూ.20 వేల ఇన్ పుట్ సబ్సిడీ, మెగా డీఎస్సీ వంటి అనేక హామీలు ఉన్నాయి.
వీటిని చంద్రబాబు సహా.. కూటమి పార్టీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా.. ఎన్నికల ప్రచారంలో జోరుగా ముందుకు తీసుకువెళ్లారు. చివరి రోజు శనివారం ప్రచారంలో నూ చంద్రబాబు ఆయా పథకాలను ఖచ్చితంగా అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. కూటమి పార్టీలకు ఓటేయాలని చెప్పారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన మరుసటి నెలలో అంటే.. జూలైలోనే ఏప్రిల్-మే-జూన్ నెలల పింఛన్లలో రూ.1000 కలిపి మరీ రూ.7000 అందిస్తామన్నారు. ఇంత బలంగా ఆయన చెప్పిన ఈ విషయంపై తాజాగా తప్పుడు ప్రచారం సర్క్యులేట్ అయింది.
చంద్రబాబు వాయిస్‌తో ఉన్న ఒక ఆడియో సందేశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “పథకాల్లేవ్ ఏం లేవ్. మా ఆస్తులన్నీ అమరావతిలోనే ఉన్నాయి. త్వరలోనే మీకు లాభాలు చూపిస్తా” అని చంద్రబాబు అన్నట్టుగా ఆ ఆడియో సందేశం ఉంది. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి ఈ ఆడియో మెసేజ్ జోరుగా వైరల్ అవుతోంది. ఈ విషయం తెలిసిన వెంటనే చంద్రబాబు ఆగ్రహోదగ్రులయ్యారు. వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
కూటమి దెబ్బతో ఓడిపోతున్నామని తెలిసి.. చివరి నిముషంలో విషం చిమ్ముతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి అంచుల్లో ఉన్న వైసీపీకి ఇంకా బుద్ధి రాలేదన్న ఆయన.. ఫేక్ వీడియోలు, ఆడియోలతో ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు డీప్ ఫేక్ ఆడియోలు, ఫేక్ లెటర్లు సృష్టించారని.. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవడంతోపాటు.. ఎన్నికల సంఘం వెంటనే బాధ్యులపై కఠినంగా వ్యవహరించాలని ఆయన కోరారు.