జగన్మోహన్ రెడ్డి 16 మాసాల పరిపాలనకు, ప్రతిపక్షాల ఆరోపణలకు తొందరలోనే నిజమైన పరీక్ష ఎదురు కాబోతోంది. తిరుపతి వైసిపి లోక్ సభ సభ్యుడు బల్లి దుర్గా ప్రసాద్ కరోనా వైరస్ కారణంగా మరణించారు. బల్లి మరణంతో తిరుపతి లోక్ సభ స్ధానం ఖాళీ అయ్యింది. కాబట్టి ఏదో రోజు ఉప ఎన్నికలు తప్పవు. ఎంపి మరణాన్ని చీఫ్ ఎలక్షన్ కమీషనర్ కేంద్ర ఎన్నికల కమీషన్ కు చెప్పటం ఆలస్యం ఉపఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు మొదలవుతాయి. తర్వాత నోటిఫికేషన్ వస్తుంది తర్వాత ఎన్నికలు జరుగుతాయి.
ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలనే విషయం ఎలక్షన్ కమీషన్ వ్యవహారమే అయినా పోటి చేసేది రాజకీయ పార్టీలే కదా. కాబట్టి ఉపఎన్నికలో వైసిపి తన అభ్యర్ధిని పెట్టడం ఖాయం. మరి ప్రతిపక్షాలు ఏమి చేస్తాయి. అందరు నరసాపరం ఎంపి రఘురామ కృష్ణంరాజు రాజీనామా చేయటమో లేకపోతే అనర్హత వేటు పడటమో జరిగితే ఉపఎన్నిక వస్తుందని అనుకుంటున్నారు. అయితే హఠాత్తుగా తిరుపతి ఎంపి చనిపోవటంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది.
కాబట్టి ప్రతిపక్షాలైన తెలుగుదేశంపార్టీ, బిజెపి+జనసేనలు ఏమి చేస్తాయనేది సస్పెన్సుగా మారింది. ప్రతిపక్షాలన్నీ కలిసి ఉమ్మడిగా అభ్యర్ధిని నిలబెడతాయా ? లేకపోతే దేనికదే తమ అభ్యర్ధిని రంగంలోకి దింపుతాయా అనేది తేలాలి. దేనికదే పోటి చేస్తే మాత్రం వైసిపికి సానుకూలత పెరుగుతుంది. ప్రతిపక్షాల ఓట్లు చీలిపోతే లబ్దిపొందేది అధికారపార్టీనే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఈ కారణంగానే మరిపుడు ప్రతిపక్షాలు ఏమి చేస్తాయనేది ఆసక్తిగా మారింది. జగన్ 16 మాసాల పాలనపై చంద్రబాబు, ప్రతిపక్షాలు ప్రతిరోజు ఆరోపణలు, విమర్శలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మరి వాళ్ళ ఆరోపణలను జనాలు ఏ మేరకు నమ్మారో తెలియాలంటే రాబోయే ఉపఎన్నికే గీటురాయి. మరి తిరుపతి పార్లమెంటు నియోజకవర్గమంటే చిత్తూరు జిల్లాలో కొన్ని నెల్లూరు జిల్లాలో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తిరుపతి నియోజకవర్గానికి చిత్తూరు జిల్లానే హెడ్ క్వార్టర్స్. చిత్తూరంటే చంద్రబాబునాయుడు సొంతజిల్లా. మరి సొంతజిల్లాలో ఈసారి చంద్రబాబు రాజకీయం ఏ స్ధాయిలో వర్కవుటవుతుందో చూడాల్సిందే. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో కుప్పంలో చంద్రబాబు తప్ప మిగిలిన అన్నీచోట్లా వైసిపినే గెలిచింది. కాబట్టి ఇపుడు చందద్రబాబు రాజకీయం ఏ రీతిలో ఉంటుందో చూడాల్సిందే. మొత్తానికి తొందరలో రాబోతున్న ఉపఎన్నికలో జనబలం వైసిపికా లేకపోతే ప్రతిపక్షలకా అని తేలిపోతుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates