ఇండియాకు ఇంకొన్నేళ్లలో కొత్త పార్లమెంటు భవనం రాబోతోంది. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధమయ్యాయి. కొత్త భవన నిర్మాణానికి టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. ప్రతిష్టాత్మక టాటా సంస్థ ఈ ప్రాజెక్టును దక్కించుకోవడం విశేషం. ఈ కాంట్రాక్టు కోసం మొత్తం ఏడు సంస్థలు పోటీపడ్డాయి. మొత్తం రూ.899 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టకు టాటా గ్రూప్ అందరికంటే తక్కువగా రూ.861.90 కోట్లకు బిడ్ వేసింది.
దాని తర్వాత లార్సన్ అండ్ టుబ్రో (ఎల్‌అండ్‌టీ) అతి తక్కువగా రూ.865 కోట్లకు బిడ్ దాఖలు చేసింది. దీంతో అందరికంటే తక్కువ ధర కోట్ చేసిన టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌కే ఈ కాంట్రాక్టు దక్కినట్లు కేంద్ర ప్రజా పనుల విభాగం తెలిపింది. కేవలం రూ.4.10 కోట్ల తేడాలో ఎల్‌అండ్‌టీ ఈ కాంట్రాక్టును టాటాకు కోల్పోయింది. సెంట్రల్ విస్టా రీడెవలెప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా కొత్త పార్లమెంటు భవన నిర్మాణాన్ని కేంద్రం చేపట్టింది.
ముందు ఏడు సంస్థలు బిడ్డింగ్‌కు ఆసక్తి ప్రదర్శించగా వాటి అర్హతలను పరిశీలించిన అధికారులు.. టాటా, ఎల్‌అండ్‌టీ, షాపోర్జి పలోంజి అండ్ కంపెనీలను తుది బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు ఎంపిక చేశారు. రూ.889 కోట్ల వ్యయంతో నిర్మించాలని భావిస్తున్నట్లు ప్రీ-బిడ్డింగ్ అర్హతకు సంబంధించిన నోటీసులో స్పష్టంచేయగా.. అంతకంటే రూ.37 కోట్లు తక్కువకే భవనాన్ని పూర్తి చేయడానికి టాటా ముందుకొచ్చింది. ప్రస్తుత పార్లమెంటు భవనానికి సమీపంలోనే కొత్త భవన నిర్మాణాన్ని చేపట్టనున్నారు. 21 నెలల వ్యవధిలో ఈ నిర్మాణ పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది.
పార్లమెంటు హౌస్ ఎస్టేట్‌లోని ప్లాట్ నెం.118లో పార్లమెంటు కొత్త భవనాన్ని నిర్మించనున్నారు. బిడ్డింగ్ ప్రక్రియ పూర్తికావడంతో టాటా ప్రాజెక్ట్స్ త్వరలోనే పార్లమెంటు కొత్త భవన నిర్మాణ పనులను ప్రారంభించే అవకాశముంది. ఐతే కోవిడ్ కారణంగా దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బ తిన్న నేపథ్యంలో భారీ ఖర్చుతో ఇప్పుడీ భవన నిర్మాణం అవసరమా అన్న ప్రశ్న తలెత్తుతోంది.