వ్య‌తిరేక‌త జ‌గ‌న్ మీద కాదు ఎమ్మెల్యేల పైనే అంటా!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో అధికారం నిల‌బెట్టుకోవ‌డం జ‌గ‌న్ శాయ‌శ‌క్తులా కృషి చేస్తున్నారు. కానీ ఎంత చేసినా వైసీపీ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. కానీ వ్య‌తిరేక‌త అనేది త‌న మీద కాద‌ని, త‌న ఎమ్మెల్యేల మీద మాత్ర‌మే అని జ‌గ‌న్ అంటున్నారు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఇదే విష‌యాన్ని తెలిపారు. ఏపీలో సంక్షేమం, అభివృద్ధి గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా జ‌రిగి ఉంటే 81 మంది ఎమ్మెల్యేల‌ను ఎందుకు మార్చారనే ప్ర‌శ్న‌కు జ‌గ‌న్ ఇలా స‌మాధానం ఇచ్చారు. సొంత స‌ర్వేలో ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త లేద‌ని, వ్య‌క్తిగ‌తంగా ఎమ్మెల్యేల‌పై మాత్ర‌మే వ్య‌తిరేక‌త ఉంద‌ని వ‌చ్చింద‌ని జ‌గ‌న్ చెప్పారు. అందుకే ఆ ఎమ్మెల్యేల‌ను మార్చామ‌న్నారు.

అభ్య‌ర్థుల ఎంపిక అనేది రిస్క్‌తో కూడింది కాద‌ని, త‌న పాల‌న‌పై ఉన్న న‌మ్మ‌కంతోనే మ‌ర్చాన‌ని జ‌గ‌న్ పేర్కొన్నారు. ఇక విశాఖ రాజ‌ధాని విషయంపై మాట్లాడుతూ.. ఎవ‌రైనా ల‌క్ష కోట్లు అమ‌రావ‌తితో పెట్టాల‌ని ఎందుకు అనుకుంటార‌ని? ఈ విష‌యంలో ప్రాక్టిక‌ల్‌గా ఆలోచిస్తున్నామ‌ని చెప్పారు. ఎవ‌రు క‌రెక్ట్ అనేది కోర్టులే నిర్ణ‌యిస్తాయ‌న్నారు. అంతే కాకుండా చంద్ర‌బాబు జైలుకు వెళ్లిన విష‌యంపైనా జ‌గ‌న్ స్పందించారు. ఏ త‌ప్పు చేయ‌క‌పోతే 52 రోజులు ఓ వ్య‌క్తి జైల్లో ఎందుకుంటారంటూ జ‌గ‌న్ వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.

మ‌రోవైపు కేంద్రంలోని బీజేపీకి మ‌ద్ద‌తు ఇచ్చేది లేద‌నేలా జ‌గ‌న్ పేర్కొన‌డం గ‌మ‌నార్హం. రాష్ట్ర అభివృద్ధి కోస‌మే క‌లిశామ‌ని బాబు, మోడీ అంటున్నార‌ని జ‌గ‌న్ చెప్పారు. ఈ అయిదేళ్లు అభివృద్ధి కోస‌మే మోడీతో స‌త్సంబంధాలు మెయింటైన్ చేశామ‌ని అన్నారు. ఈ సారి మోడీకి 20 సీట్లు త‌గ్గితే మ‌ద్ద‌తునిస్తారా అనే ప్ర‌శ్న‌కు మాత్రం అది ఊహాజ‌నిత ప్ర‌శ్న అని జ‌గ‌న్ స‌మాధానం ఇచ్చారు. తాను పోరాడేవాళ్ల‌తో క‌లిసి త‌న‌మీద బీజేపీ పోరాడుతోంద‌ని జ‌గ‌న్ పేర్కొన్నారు. అలాంటి పార్టీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం కుద‌ర‌ద‌నే అర్థం వ‌చ్చేలా జ‌గ‌న్ వ్యాఖ్య‌లు చేశారు.