ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక అతి పెద్ద వైఫల్యాల్లో ఒకటిగా మారిన అంశం నిరుద్యోగం. ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఇస్తా.. ఖాళీ ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నింటికీ నోటిఫికేషన్లు ఇచ్చి ఖాళీలన్నీ భర్తీ చేసేస్తాం అని ఘనంగా హామీలు ఇచ్చిన జగన్.. అధికారంలోకి వచ్చాక వాటిని నిలబెట్టుకోలేకపోయారు. ఉద్యోగులు కాని వాలంటీర్లను.. ప్రభుత్వంలో విలీనం అయిన ఆర్టీసీ ఉద్యోగులను చూపించి లక్షల్లో ఉద్యోగాలు కల్పించినట్లు ఘనంగా నంబర్లు వేసుకోవడం జగన్ సర్కారుకే చెల్లింది.
ప్రభుత్వ ఉద్యోగాల సంగతి అలా ఉంచితే.. కొత్తగా ఏపీకి ఆశించిన స్థాయిలో పరిశ్రమలు రాకపోవడం, ఆల్రెడీ ఉన్న, రావాల్సిన పరిశ్రమలను వెనక్కి పంపడం ద్వారా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య మరింత పెరిగేలా చేసిందని జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. వైసీపీ సర్కారు ప్రధాన వైఫల్యాల్లో ఒకటిగా ప్రతిపక్షాలు చూపిస్తున్న ఈ అంశంపై సీఎం జగన్.. రాజ్‌దీప్ సర్దేశాయ్ ఇంటర్వ్యూలో స్పందించాడు.
ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల కల్పనకు తోడ్పాటు అందించడం వల్ల పెద్దగా ప్రయోజనం లేదన్నట్లు ఆయన మాట్లాడ్డం గమనార్హం. ఒక ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు కల్పించగలదు.. ఒక పెద్ద కంపెనీ వస్తే ఎన్ని ఉద్యోగాలు వచ్చేస్తాయి.. చాలా తక్కువ అని ఆయన వ్యాఖ్యానించారు. అసలు ఆర్థికాభివృద్ధి అంతా స్వయం ఉపాధిలోనే ఉందని.. దీని వల్లే ఎకానమీ ఎదుగుతుందని ఆయన పేర్కొన్నారు. రైతులు, చేతి వృత్తుల వాళ్లు, ఇతర కార్మికులే ఎకానమీలో కీలకమని.. వాళ్లకు తోడ్పాటు అందిస్తే చాలని జగన్ అభిప్రాయపడ్డారు.
జగన్ చెప్పిన వర్గాలకు తోడ్పాటు అందించాల్సిన విషయం వాస్తవమే కానీ.. ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాల్సిన బాధ్యతను.. అలాగే సరళమైన పారిశ్రామిక విధానం ద్వారా ఎక్కువ సంఖ్యలో పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరాన్ని జగన్ గుర్తించకుండా అదేమంత ముఖ్యమైన విషయం కాదన్నట్లు మాట్లాడ్డం విడ్డూరంగా అనిపిస్తోంది. దీని మీద సామాజిక మాధ్యమాల్లో జగన్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates