ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండగా. వైఎస్ కుటుంబంలో తీవ్ర స్థాయిలో పరస్పరం మాటల దాడి జరుగుతోంది. వైఎస్ జగన్, అవినాష్ రెడ్డి ఓ వైపు ఉంటే… మరోవైపు షర్మిళ, సునీత నిలిచారు. వైఎస్ వివేకా హత్య విషయంలో ఒకరి మీద ఒకరు తీవ్రంగా విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు.
పులివెందులలో జరిగిన సభలో షర్మిళ, సునీతల మీద జగన్ ఎలా విరుచుకుపడ్డాడో తెలిసిందే. ఆ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారిన నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన సునీత.. జగన్‌కు ఇచ్చిన ఓ సలహా అందరి దృష్టినీ ఆకర్షించింది. వారం కిందట జరిగిన రాయి దాడి నేపథ్యంలో జగన్ నుదుటికి బ్యాండేజీతో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. చిన్న గాయానికి రోజుల తరబడి బ్యాండేజ్ వేసుకుని కనిపించడం మీద సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ మోత మోగుతోంది.
ఈ నేపథ్యంలో సునీత కూడా ఆ బ్యాండేజీ గురించి స్పందించింది. జగన్‌కు గాయం కావడం దుదరృష్టకరమని అంటూ.. ఆయనకు వైద్య పరంగా ఎవరో తప్పుడు సలహాలిస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. ఇలాంటి గాయాలు అయినపుడు ఎక్కువ రోజుల పాటు బ్యాండేజీలు వేయడం, కట్లు కట్టడం మంచిది కాదని ఆమె అన్నారు. దాని వల్ల సెప్టిక్ అయి గాయం ఇంకా పెద్దది అవుతుందని.. గాయాన్ని మామూలుగా వదిలేస్తే గాలికి ఆరి త్వరగా మానుతుందని ఆమె చెప్పారు. ఒక డాక్టర్‌గా ఇది తాను చెబుతున్నానని.. జగన్ ఇకనైనా బ్యాండేజ్ తీసేస్తే మంచిదని ఆమె అన్నారు. పరోక్షంగా జగన్‌కు సునీత గట్టి పంచే వేసినట్లు కనిపిస్తోంది. గాయానికి బ్యాండేజీ వేసి సింపతీ రాబట్టాలని జగన్ ప్రయత్నిస్తున్నారని.. ఎన్నికలు అయ్యే వరకు ఆయన ఈ బ్యాండేజ్ తీయకపోవచ్చని సోషల్ మీడియాలో ఆయనపై పంచ్‌ల వర్షం కురుస్తోంది.