ఒకే అంశంపై ఎన్ని సంస్ధలు దర్యాప్తు చేస్తాయి ?

ఓ విషయంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహారం చాలా విచిత్రంగా ఉంది. ఒకే అంశంపై అనేక సంస్ధలతో దర్యాప్తు చేయిస్తున్నారు. అసలు ఇన్ని సంస్ధలు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందా ? అనే ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సుంటుంది. ఇదే ప్రశ్నను చంద్రబాబునాయుడు కూడా నేతలతో జరిగిన కాన్ఫరెన్సులో సూటిగా ప్రభుత్వాన్ని నిలదీశారు.

ఇంతకీ విషయం ఏమిటంటే ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనే ఆరోపణలు ప్రస్తుతం రాష్ట్రాన్ని పట్టి కుదిపేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇన్ సైడర్ ట్రేడింగ్ లో చంద్రబాబుతో పాటు ఆయన మద్దతుదారులు, సన్నిహితులు, టిడిపిలోని కీలక నేతలు 4075 ఎకరాలను అక్రమంగా సొంతం చేసుకున్నారని ఆరోపిస్తోంది ప్రభుత్వం. సరే తనపై ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలే అంటూ చంద్రబాబు బృందం ఎదురుదాడులు చేస్తున్నారు. విచారణకు రెడీ అంటున్నారు.

ఆరోపణలు, ప్రత్యారోపణలు రాజకీయాల్లో సహజమే. కాకపోతే ఇఫుడు ప్రభుత్వంలోని పెద్దలు చేస్తున్న ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలను తాము ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండే చేస్తున్నారు. ఉత్త ఆరోపణలేనా లేకపోతే అందులో ఏమన్నా వాస్తవం ఉందా అని తేల్చేందుకు విచారణలు చేయించటం చాలా అవసరం. దర్యాప్తు జరగటమన్నది ఆరోపణలు చేస్తున్న వాళ్ళకు మాత్రమే కాదు ఆరోపణలను ఎదుర్కొంటున్న వాళ్ళకు కూడా చాలా అవసరమే.

ప్రభుత్వం ఇదే పని మొదలుపెట్టినా కాస్త విచిత్రంగా వ్యవహరిస్తోంది. ఎందుకంటే ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై ముందు మంత్రివర్గ ఉపసంఘంతో విచారణ అన్నారు. తర్వాత ఏసిబి దర్యాప్తన్నారు. ఆ తర్వాత ఈడి కూడా రంగంలోకి దిగిందని చెప్పారు. చివరకు సిబిఐతో విచారణ చేయించే ఉద్దేశ్యంతో కేంద్రప్రభుత్వానికి సిఫారసు చేశారు. మళ్ళీ ఇపుడు ఏసిబి విచారణ జోరందుకుంది. ఇంతలోనే హైకోర్టు జోక్యంతో విచారణకు బ్రేకులు పడిపోయింది.

ఒకే అంశంపై ఇన్ని దర్యాప్తు సంస్ధలతో ప్రభుత్వం ఎందుకు విచారణ చేయిస్తోందో ఎవరికీ అర్ధం కావటం లేదు. మంత్రివర్గ ఉపసంఘం అంటే అంతర్గత విచారణ జరిపి ఆరోపణలపై ఆధారాలు సేకరించిందని అనుకుందాం. మరి ఏసిబి ఏమి దర్యాప్తు చేస్తుంది. ఒకసారి ఏసిబి రంగంలోకి దిగిన తర్వాత ఈడి విచారణ దేనికి. ఇదే సమయంలో సిబిఐ విచారణకు ఎందుకు సిఫారసు చేసినట్లు ? ఒకవైపు సిబిఐ విచారణకు సిఫారసు చేయగానే ఏసిబి జోరెందుకు పెంచినట్లు ? ఏమిటో అంతా గందరగోళం ఉంది. సరే హైకోర్టు మొత్తం విచారణకే బ్రేకులు వేసిందనుకోండి అది వేరే సంగతి. మరి ఇపుడు పడిన బ్రేకులు తాత్కాలికమా ? లేకపోతే శాశ్వతమా ? అన్నది చూడాలి.

All the Streaming/OTT Updates you ever want. In One Place!