ఐదేళ్ళ పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎన్నికల ప్రచారంలో కీలకమైన అంశాల గురించి అస్సలు ప్రస్తావించకపోవడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
గతంలో ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారు. అది వైసీపీ ప్రతిపక్షంలో వున్నప్పుడు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అయితే ఏకంగా ఆమరణ నిరాహార దీక్ష కూడా చేసేశారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామనీ నినదించారు.
ఇప్పుడేమో అసలు ప్రత్యేక హోదా అంశం గురించే మాట్లాడటంలేదు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. తన హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు ఎంతవరకు వచ్చాయన్న విషయాన్ని కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం.
సొంత జిల్లా కడపలో నిర్మించ తలపెట్టిన కడప స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా వైఎస్ జగన్ పెదవి విప్పలేకపోవడం పట్ల వైసీపీ శ్రేణులే ఆశ్చర్యపోతున్నాయి. బస్సు యాత్ర ముగింపు దశకు వచ్చేసింది. ఇడుపుల పాయ నుంచి మొదలైన బస్సు యాత్ర, ఉభయ గోదావరి జిల్లాలకు వచ్చేసరికి పూర్తిగా చప్పబడిపోయింది.
కృష్ణా, గుంటూరు జిల్లాలోనే తేలిపోయిన వైఎస్ జగన్ బస్సు యాత్ర, చివరికి తుస్సు యాత్రగా మిగిలిపోయేలా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ మీద వున్న ధ్యాస, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడటంపై లేకపోవడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
సంక్షేమం.. సంక్షేమం.. సంక్షేమం.. ఎక్కడికి వెళ్ళినా దీని గురించే మాట్లాడుతున్న వైఎస్ జగన్. రెండున్నర లక్షల కోట్ల రూపాయల్ని నేరుగా లబ్దిదారులకు సంక్షేమ పథకాల రూపంలో అందించామన్నది వైఎస్ జగన్ ఊదరగొడుతున్న అంశం. ఎవరు అధికారంలో వున్నా, సంక్షేమం కొనసాగుతుంది. ఇంకా ఎక్కువవుతుంది. ఈ విషయంలో ఓటర్లకు ఖచ్చితమైన అభిప్రాయాలున్నాయి.
కానీ, అభివృద్ధి.. ఇదే కీలకం. పోలవరం ప్రాజెక్టు, రాష్ట్రానికి జీవనాడి. ఇలాంటి విషయాలపై వైఎస్ జగన్ అసలెందుకు మౌనం దాల్చుతున్నారు.? మాట్లాడుకోడానికి అసలు ఏముందని.?