జ‌న‌సేన‌లో కోటీశ్వ‌రురాలు.. మాధ‌వి ఆస్తులు వంద‌ల కోట్లు!

సామాన్యుల‌కు టికెట్ లు ఇస్తామ‌ని.. వారిని గెలిపించుకుంటామ‌ని చెప్పిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా.. స‌మ‌యా నికి త‌గిన విధంగానే(అంటే.. ప్ర‌త్య‌ర్థి పార్టీలు ఇస్తున్న టికెట్లు.. వారి అభ్య‌ర్థుల ఆర్థిక బ‌లం, అంగ బ‌లాల‌ను దృష్టిలో ఉంచుకునే) అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేసుకున్నారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ కోటీశ్వ‌రుడు అన్న విష‌యం తెలిసిందే. ఇక‌, ఆయ‌న టికెట్ ఇచ్చిన వారిలో ఒకే ఒక మ‌హిళ ఉన్నారు. ఆమే లోకం మాధ‌వి. బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి చెందిన మాధ‌వి గురించి ఉత్త‌రాంధ్ర‌కు ప‌రిచ‌యం ఉన్నా.. ఇత‌ర ప్రాంతాల వారికి తెలియ‌దు.

పార్టీకి రూ.10 కోట్ల విరాళం ఇచ్చిన ఆమె గ‌త ఏడాది వెలుగులోకి వ‌చ్చారు. ఈ నేప‌థ్యంలోనే తాజా ఎన్నిక‌ల్లో లోకం మాధ‌వికి జ‌న‌సేన అధినేత‌.. కీల‌క‌మైన నెల్లిమ‌ర్ల అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. శ‌నివారం విజయనగరం జిల్లాలో పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.

నెల్లిమర్ల నుంచి పోటీ చేస్తున్న లోకం నాగమాధవి కూడా తాజాగా నామినేష‌న్ వేశారు. ఈ స‌మ‌యంలో ఎన్నిక‌ల సంఘానికి ఆమె స‌మ‌ర్పించిన అఫిడ‌విట్‌లో త‌న కుటుంబ ఆస్తి పాస్తుల వివ‌రాలు ఆమె వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ఆమె వెల్ల‌డించిన వివ‌రాల మేర‌కు మాధ‌వి ఆస్తుల విలువ రూ.894.92 కోట్లు ఉంది.

దీనికి తోడు మాధ‌వి కుటుంబానికి రూ.800 కోట్లకు పైగా విలువైన మిరాకల్ సాఫ్ట్వేర్ కంపెనీ ఉన్న‌ట్టు తెలిపారు. అమెరికా స‌హా విదేశాల్లో వ్యాపారాలు చేస్తున్న‌ట్టు వివ‌రించారు. ప‌లు విద్యాసంస్థ‌లు, భూములు, న‌గ‌లు ఉన్నాయ‌ని తెలిపారు.

ప్ర‌స్తుతం చేతిలో ల‌క్ష 15 వేల రూపాయ‌ల న‌గ‌దు ఉంద‌ని, బ్యాంకులో 4.5 కోట్ల వ‌ర‌కు న‌గ‌దు ఉంద‌ని తెలిపారు. స్థిరాస్తుల విలువ 15.67 కోట్ల వ‌ర‌కు ఉంద‌ని, 2.96 కోట్ల రూపాయ‌ల అప్పులు ఉన్నాయ‌ని మాధ‌వి వివ‌రించారు. అయితే.. త‌న అఫిడ‌విట్‌లో భ‌ర్త ఆస్తుల ను ఆమె వెల్ల‌డించ‌లేదు. దీంతో జ‌న‌సేన అభ్య‌ర్థి ఆస్తులు ఇన్ని కోట్లా అనే చ‌ర్చ జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం.