మ‌ళ్లీ రేవంతే సైన్యంగా!

అవి 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వ‌చ్చి కొడంగ‌ల్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన రేవంత్ రెడ్డి ఓట‌మి పాల‌య్యారు. అప్పుడు ఎవ‌రైనా ఊహించి ఉంటారా.. రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం అవుతారని, రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ చిత్రంగా మార‌తార‌ని. కానీ రేవంత్ స‌వాళ్ల‌ను దాటి నిల‌బ‌డ్డారు. 2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మ‌ల్కాజిగిరి నుంచి విజ‌య‌దుందుభి మోగించారు. టీపీసీసీ అధ్య‌క్షుడిగా 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌ను విజ‌య‌తీరాల‌కు చేర్చారు. ముఖ్య‌మంత్రి పీఠం అధిరోహించారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటారా?  ప్ర‌స్తుతం లోక్‌స‌భ ఎన్నిక‌ల్లోనూ తెలంగాణ‌లో కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు గెలిచేలా ఒక్క‌డే సైన్య‌మై రేవంత్ సాగ‌బోతున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రేవంత్ దూకుడు చూశాం. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కొడంగ‌ల్‌లో ఎప్ప‌టిక‌ప్పుడూ ప‌రిస్థితి ప‌ర్య‌వేక్షిస్తూనే.. మ‌రోవైపు రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేశారు. ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌మ అభ్య‌ర్థుల గెలుపు కోసం కృషి చేశారు. ఒక్క రోజులో రెండు మూడు స‌భ‌ల్లో పాల్గొన్నారు. ఇత‌ర అగ్ర‌శ్రేణి నేత‌లంతా త‌మ నియోజ‌క‌వ‌ర్గాల‌కే ప‌రిమిత‌మ‌వుతే రేవంత్ మాత్రం పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లే బాధ్య‌త‌ను తీసుకున్నారు. పార్టీని గెలిపించుకున్నారు.

ఇప్పుడు లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో తెలంగాణ‌పై కాంగ్రెస్ అధిష్ఠానం స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టింది. ఇక్క‌డ అధికారంలో ఉండ‌టంతో వీలైన‌న్ని ఎక్కువ లోక్‌స‌భ స్థానాలు గెల‌వాల‌ని చూస్తోంది. రేవంత్ కూడా 17 స్థానాల‌కు 15 చోట్ల కాంగ్రెస్‌ను గెలిపించేలని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. మ‌రోసారి ప్ర‌చారాన్ని ప‌ర‌వ‌ళ్లు తొక్కించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ప్ర‌స్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్‌కు ఉన్న చ‌రిష్మానే వేరు. కార్య‌క‌ర్త‌ల్లో క‌సి నింపి, వాళ్ల రక్తాన్ని మ‌రిగిస్తూ పార్టీ కోసం ప‌ని చేసేలా రేవంత్ చేస్తున్నారు. అందుకే పార్టీ కార్య‌క‌ర్త‌ల్లో రేవంత్‌పై ఎన‌లేని ప్రేమ క‌లుగుతోంది. ఇప్పుడు లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గాల ప‌ర్య‌ట‌న‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. మ‌రోసారి సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేయ‌బోతున్నారు. త‌న‌పై, పార్టీపై ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ‌ను మ‌రోసారి ఓట్ల రూపంలోని మార్చేందుకు అడుగులు వేస్తున్నారు.