సునీత ప్రజెంటేషన్ పై స్పందించిన అవినాష్ రెడ్డి

తన తండ్రి వైఎస్ వివేకాను ఎంత దారుణంగా హత్య చేశారో వివరిస్తూ మీడియా ప్రతినిధుల ముందు వివేకా తనయురాలు సునీతా రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ ప్రజెంటేషన్ చూసిన తర్వాత వివేకా హత్య ఎంత పాశవికంగా జరిగింది అన్న విషయం బట్టబయలైంది. వివేకా హత్య గురించి సునీత మరికొన్ని ఆధారాలు బయటపెట్టడంతో వైసీపీ డిఫెన్స్ లో పడింది. ఈ క్రమంలోనే తాజాగా వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆ వ్యవహారంపై స్పందించారు. ఈ సందర్భంగా సునీతపై అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

వివేకాను చంపిన దస్తగిరితో కుమ్మక్కైన సునీత అతడిని అప్రూవర్ గా మార్చి తనపై రాజకీయంగా బురదజల్లుతున్నారని అవినాష్ ఆరోపించారు. వివేకాను తానే హత్య చేశానని దస్తగిరి ఒప్పుకున్నారని, అయినా సరే ఆయనను సాక్షిగా మార్చేందుకు సునీత ఒప్పందం చేసుకున్నారని షాకింగ్ ఆరోపణలు చేశారు. వివేకా హత్యపై సీబీఐ దగ్గర సునీత వాంగ్మూలం ఇచ్చారని, కానీ, ఆ తర్వాత వివేకా రాసిన లెటర్ గురించి తనకు తెలియదని తప్పించుకున్నారని అవినాష్ రెడ్డి ఆరోపించారు.

సునీత మేనమామ శివ ప్రకాష్ రెడ్డిని ఈ కేసులో మూడో వ్యక్తి అని ఆరోపించడం సరికాదని అవినాష్ అన్నారు. వివేకా హత్య గురించి ఎర్ర గంగిరెడ్డికి ఫోన్ చేసింది శివప్రకాష్ రెడ్డేనని అన్నారు. హత్య తర్వాత వాళ్లు ఫోన్ చేస్తేనే ఎర్ర గంగిరెడ్డి అక్కడికి వచ్చారని వివరించారు. వివేకాను చివరి రోజుల్లో సునీత దుర్భర పరిస్దితుల్లోకి నెట్టారని, చివరికి చెక్ పవర్ కూడా రద్దు చేశారని ఆరోపించారు. ఈ కేసు గురించి మాట్లాడడం తనకు ఇష్టం లేదని, కానీ, షర్మిల, సునీతల ఆరోపణలకు సమాధానం ఇవ్వాలని వచ్చానని చెప్పారు. గూగుల్ టేకౌట్ సమాచారం సరికాదని సీబీఐ స్వయంగా కోర్టులో చెప్పిందని గుర్తు చేశారు. చంద్రబాబు కుట్రలో పడి సునీత ఇదంతా చేస్తున్నారని అవినాష్ ఆరోపించారు.