ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 1996లోజరిగిన దళిత యువకులపై దాడి. .. ఇద్దరి శిరోముండనం కేసులో విశాఖ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మొత్తం 9 మంది నిందుతులను దోషులుగా తేల్చిన కోర్టు.. వీరికి ఏడాదిన్నర(18 నెలలు) కఠిన కారాగారంతోపాటు.. రెండు లక్షల రూపాయల భారీ జరిమానా కూడా విధించింది. వీరిలో వైసీపీ మండపేట అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి తోట త్రిమూర్తులు కూడా ఉన్నారు.
ఏం జరిగింది?
1996, డిసెంబరు 29న తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రపురం మండలం, వెంకటాయ పాలెంలో అప్పట్లో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొందరు యువకులు.. ఆందోళన చేశారు. దీనిని తీవ్రంగా భావించిన తోట త్రిమూర్తులు.. ఆదేశాలతో ఆయన వర్గం కార్యకర్తలు ఎస్సీ యువతను నిర్బంధించి.. తీవ్రంగా హింసించారనే ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు.. వీరిని తర్వాత.. పోలీసు స్టేషన్‌కు తరలించి.. అక్కడే ఇద్దరికి శిరోముండనం చేయడం అప్పట్లోరాష్ట్ర వ్యాప్తంగా అగ్గి రేపింది.
ఈ కేసులో పోలీసుల ప్రమేయం కూడా ఉందని తేలడంతో దీనిని తీవ్రంగా భావించిన ప్రభుత్వం.. అట్రా సిటీ కేసు నమోదు చేయించింది. ఇక, అప్పటి నుంచి విచారణ సాగుతూనే ఉంది. 28ఏళ్ల సుదీర్ఘ విచారణలో 2019 వరకు ఈ కేసు ఒక అడుగు ముందుకు.. పది అడుగులు వెనక్కి అన్నట్టుగా సాగింది. ఈ కేసులో న్యాయం చేయాలంటూ.. కొన్ని దఫాలుగా ఎస్సీ సామాజిక వర్గాలు పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేశాయి. దీనిపై 146 సార్లు కోర్టులో వాయిదాలు కూడా పడ్డాయి.
ఎట్టకేలకు వైసీపీ ప్రభుత్వం జోక్యంతో స్థిరమైన విచారణ ముందుకు సాగింది. 2019 నుంచిఎలాంటి విఘ్నాలు లేకుండానే కేసు విచారణ పరుగులు పెట్టింది. తాజాగా ఎస్సీ, ఎస్టీ కేసుల కోర్టు దీనిపై సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో అప్పటి టీడీపీ నాయకుడు ప్రస్తుతం వైసీపీలో ఉన్న తోట త్రిమూర్తులు చుట్టూనే ఆరోపణలు ఎగిసి పడ్డాయి. తాజాగా.. 10 మంది నిందితుల్లో 9 మందిని కోర్టు దోషులుగా తేల్చి చెప్పింది. వీరికి ఏడాదిన్నర జైలు శిక్షతోపాటు.. 2 లక్షల రూపాయల వరకు జరిమానా విదించింది. అయితే.. దీనిని హైకోర్టులో సవాల్ చేసుకునే అవకాశం ఉంది.