రాయిని రాయితోనే!

వైసీపీకి షాక్‌. అవును.. సీఎం జ‌గ‌న్‌పై రాయి దాడిని వాడుకుని సింప‌తీ పొందాల‌ని చూసిన ఆ పార్టీకి గ‌ట్టిదెబ్బ త‌గిలింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. జ‌గ‌న్‌పై దాడికి టీడీపీ అధినేత చంద్ర‌బాబును బాధ్యుడిగా చేస్తూ, ఇది టీడీపీ కుట్ర అంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగ‌తి తెలిసిందే. కానీ ఇప్పుడిక ఇలాంటి ఆరోప‌ణ‌లు చేసేముందు వైసీపీ ఆలోచించుకోవాల్సిన ప‌రిస్థితి త‌లెత్తింద‌నే టాక్ వినిపిస్తోంది. టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు, జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై రాళ్ల దాడి జ‌ర‌గ‌డంతో వైసీపీ మింగ‌లేని క‌క్క‌లేని ప‌రిస్థితిలో ఉంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

విజ‌య‌వాడ‌లో జ‌గ‌న్‌పై రాయితో దాడి జ‌రిగిన మ‌రుస‌టి రోజే గాజువాక‌లో బాబుపై, తెనాలిలో ప‌వ‌న్‌పై రాయితో దాడి జ‌ర‌గ‌డం క‌ల‌క‌లం రేపింది. ఈ ఘ‌ట‌న‌ల‌తో వైసీపీకి దిమ్మ తిరిగింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. జ‌గ‌న్‌పై దాడి టీడీపీ ప‌నే అంటూ ఇప్పుడు గ‌ట్టిగా ఆరోపించ‌లేని ప‌రిస్థితి వైసీపీది. ఎందుకంటే జ‌గ‌న్‌పై దాడి టీడీపీ చేయించిందంటే.. ఇప్పుడు ప‌వ‌న్‌, బాబుపై దాడి వైసీపీనే చేయించింద‌నే కౌంట‌ర్ వ‌చ్చే అవ‌కాశ‌ముంది. ఒక‌వేళ ప‌వ‌న్‌, బాబుపై రాళ్ల దాడి డ్రామా అని వైసీపీ విమ‌ర్శిస్తే.. అప్పుడు జ‌గ‌న్‌పై దాడి కూడా డ్రామానే అని టీడీపీ, జ‌నసేన కూడా స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇవ్వొచ్చు.

ఇలా మొత్తానికి రాయితో దాడితో జ‌గ‌న్‌కు ఒరిగిదేమీ లేద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఎలా జ‌రిగిందో కానీ బాబు, ప‌వ‌న్‌పై రాళ్ల దాడితో వైసీపీకి రాజ‌కీయంగా డ్యామేజీ క‌లిగే అవ‌కాశ‌ముంద‌ని చెబుతున్నారు. దీంతో వైసీపీ నాయ‌కులు సైలెంట్ అవాల్సిన ప‌రిస్థితి త‌లెత్తింద‌నే చెప్పాలి. ఇప్పుడిదే టీడీపీ, జ‌న‌సేన‌కు క‌లిసొచ్చే అంశంగా మారింది. మ‌రి ఈ విష‌యంలో జ‌గ‌న్‌, వైసీపీ నాయ‌కులు ఇప్పుడు ఎలాంటి వ్యూహాన్ని అనుస‌రిస్తారో చూడాలి.