వైసీపీ అధినేత, సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరుతో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార బస్సు యాత్రలో కలకలం రేగింది. తాజాగా ఈ యాత్ర విజయవాడ శివారు ప్రాంతమైన సింగ్‌నగర్ మీదుగా సాగింది. ఇక్కడి పైపుల్ రోడ్డు సెంటర్‌లో నాలుగు రోడ్ల కూడలి వద్ద సీఎం జగన్ బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ.. ముందుకు సాగుతున్నారు. అయితే.. ఈ సమయంలో ఆయనపై రాయితో దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి బలంగా విసిరిన రాయి.. దాదాపు 7 అడుగుల ఎత్తున ఉన్న సీఎం జగన్ నుదుటిపై తాకింది.దీంతో ఎడమ కంటి కనుబొమ దగ్గర గాయమైంది. కొద్దిగా రక్తస్రావం కూడా జరిగింది. అయితే.. భారీ ఎత్తున ప్రజలు తరలి రావడంతో రాయిని ఎవరు విసిరారనే విషయంపై అస్పష్టత నెలకొంది. అయితే వెంటనే అప్రమత్తమైన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే.. వీరే విసిరారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇదిలావుంటే.. రాయితో దాడి అనంత రం.. కూడా జగన్‌తన యాత్రను కొనసాగించారు. బస్సులోనే ఉన్న ప్రత్యేక వైద్యుడు ఒకరు జగన్‌కు ప్రాథమిక చికిత్స చేశారు. తలకు బ్యాండ్ ఎయిడ్ వేశారు. అదేవిధంగా ఫ్లూయిడ్ అందించారు.అనంతరం.. యాత్రను కొనసాగించారు. అయితే.. గత నెలలో కూడా సీఎం జగన్‌పై దాడి జరిగింది. అప్పట్లో కర్నూలులో నిర్వహించిన యాత్రలో గుర్తు తెలియని వ్యక్తి చెప్పు విసిరాడు. అయితే.. ఇది జగన్‌కు తృటిలో తప్పించి.. పక్కన పడింది. అప్పట్లోనూ దీనిపై అనేక విమర్శలు వచ్చాయి. అయితే.. తాజాగా జరిగిన రాయి ఘటన వెనుక రెండో వాదన కూడా వినిపిస్తోంది. రాయి కాదని.. అది క్యాట్ బాలని కొందరు చెబుతున్నారు. ఇక, అంత పెద్ద సెక్యూరిటీ ఉండి కూడా.. పట్టించుకోలేదా? అనేది కూడా చర్చనీయాంశం అయింది. దీని వెనుక నిజానిజాలు తెలియాల్సి ఉంది. కానీ, ఏలూరు దిశగా జగన్ తన యాత్రను కొనసాగించారు.