వైసీపీకి స్వపక్షంలో విపక్షంలో మారిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణ రాజు తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై అనర్హత వేయాలంటూ వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి…రాజ్యాంగంలో షెడ్యూల్ 10 చదవాలని అన్నారు. సీఎం జగన్ గారు నిత్యం పరితపించే ఇంగ్లిష్ లోనే షెడ్యూల్ 10 ఉందని, మాతృభాష తెలుగును కాపాడాలన్నందుకే తనను డిస్ క్వాలిఫై చేయాలని అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
5వ తరగతి వరకు మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని ప్రధాని మోడీ కూడా అన్నారని….కాబట్టి ప్రధానిగా ఉండే అర్హత మోడీకి లేదని జగన్ అంటారేమో అని సంచలన వ్యాఖ్యలు చేశారు. విప్ ధిక్కరిస్తే, పార్టీని రెండు ముక్కలు చేయాలని చూస్తే తప్ప..తనపై అనర్హత వేటు వేయడం సాధ్యం కాదని, ఇసుక దోపిడీ, దేవాదయ శాఖ భూములను అమ్ముకోవాలనుకోవడం వంటి అంశాలపై ప్రశ్నిస్తే అనర్హత వేటు వేయరని అన్నారు. జగన్ గారు చల్లగా ఉండాలని, ప్రభుత్వాన్ని కాపాడుతున్నానని అది అర్థం చేసుకోకుండా కొందరు ఆయనకు, తనకు మధ్య గ్యాప్ పెంచుతున్నారని అన్నారు.
తనను పార్టీ నుంచి బహిష్కరించినా, పార్లమెంటులో కమిటీ చైర్మన్ గా కొనసాగుతానని రఘురామ అన్నారు. కావాలంటే తనను బహిష్కరించి చూడాలని, ఎలాగైనా కమిటీ చైర్మన్ గా తానే కొనసాగుతానని చాలెంజ్ చేశారు. చట్ట ప్రకారం తనపై అనర్హత వేటు వేయడం సాధ్యం కాదని, తన వాగ్ఢాటితో కమిటీ చైర్మన్ పదవి సాధించుకున్నానని చెప్పారు.
పార్లమెంటులో పదవులన్నీ ఒక సామాజిక వర్గానికే దక్కుతున్నాయని విమర్శించారు. తనపై అనర్హత వేటు వేయాలని మిథున్ రెడ్డి కోరుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వ పనుల గురించి ఏనాడైనా మిథున్ రెడ్డి మాట్లాడారా అని ప్రశ్నించారు. లోక్ సభా పక్ష నేత ఎన్నిక జరిపితే మిథున్ రెడ్డికి 3 ఓట్లకు మించి రావని, మిథున్ రెడ్డిపై చాలామంది ఎంపీలకు అసంతృప్తి ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.