కరోనా సంక్షోభ సమయంలోనూ ఏపీ సీఎం జగన్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని వైసీపీ నేతలు ప్రశంసిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వాన్ని నడిపేందుకు, సంక్షేమ పథకాల అమలుకు జగన్ పరిమితికి మించి అప్పులు చేస్తున్నారని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఖజానా నింపుకునేందుకు ప్రజలపై సైలెంట్ గా పన్నుబాదుడు విధిస్తున్నారని ఆరోపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే భారీగా మద్యం ధరల పెంపు, పెట్రో, డీజిల్ ధరలు, భూముల ధరలు, రిజిస్ట్రేషన్ చార్జీలు ఇలా సైలెంట్ గా జగన్ దాదాపు 15 వేల కోట్ల రూపాయలను పన్నుల రూపంలో వసూలు చేశారని తెలుస్తోంది. ఆర్టీసీ చార్జీలు, కరెంటు చార్జీలు వీటికి అదనమని, త్వరలోనే రవాణాశాఖలో పన్నులు పెంచాలనే యోచనలోనూ జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.
రవాణా శాఖలో పన్నుల పెంపు ద్వారా సుమారు రూ. 400 కోట్లు, గ్రీన్ ట్యాక్స్ పెంపు ద్వారా అదనంగా రూ.30 కోట్లు అదనపు ఆదాయం రాబట్టాలని జగన్ సర్కార్ యోచిస్తోందట. భవిష్యత్తులో ఈ తరహాలోనే మరో 3 వేల కోట్ల రూపాయలను పన్నుల రూపంలో వసూలు చేసి ఖజానా నింపేందుకు జగన్ సైలెంట్ బాదుడు కార్యక్రమాలు మరిన్ని చేపట్టే అవకాశముందని తెలుస్తోంది.
ఓ వైపు సంక్షేమ పథకాలు…మరోవైపు కరోనా విపత్తు నిర్వహణ…వెరసి ఏపీ సర్కార్ ఆర్థిక ఇబ్బందులలో చిక్కుకుందని, వాటి నుంచి గట్టెంకేందుకే జగన్ సర్కార్ అవకాశమున్న చోటల్లా పన్నులు పెంచుకుంటూ పోతోందని విమర్శలు వస్తున్నాయి. అసలే ఆర్థిక లోటు ఉన్న ఏపీ ఖజానా…. కరోనా నేపథ్యంలో నిండుకుంది. ఏప్రిల్ తర్వాతి 4-5 నెలల్లో రాష్ట్ర ఖజానా దాదాపు రూ.15 వేల కోట్ల ఆదాయం కోల్పోయింది.
ఓ వైపు ఆదాయం లేక మరోవైపు కరోనా విపత్తు నిర్వహణకు ఖర్చు పెరగడం, సంక్షేమ పథకాలకు నిధుల కొరత…వంటి కారణాలతో నిధులకు తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో, ఈ ఏడాదిలో ఇప్పటివరకు రూ.31వేల కోట్లు రుణాలు తీసుకుంది ఏపీ సర్కార్. దానికి అదనంగా మే నెల నుంచి ఇప్పటి వరకు రకరకాల పన్నుల పెంపు ద్వారా రూ.15 వేల కోట్లు రాబట్టింది. మే మొదటివారంలో 75 శాతం మద్యం ధరలు పెంపు ద్వారా రూ.13500 కోట్ల అదనపు ఆదాయం వచ్చింది.
జూన్ లో పెట్రో్ల్, డీజిల్ రేట్ల పెంపుతో రూ.600 కోట్లు, ఆగస్టులో భూముల ధరల పెంపుతో రూ.800 కోట్లు, వృత్తి పన్ను పెంపుతో రూ.161 కోట్లు రాబట్టింది ఏపీ సర్కార్. తాజాగా గ్యాస్ పై వ్యాట్ 10 శాతం పెంచడం ద్వారా రూ.300 కోట్ల అదనపు ఆదాయం రాబట్టేందుకు సిద్ధమైంది. పన్నుల రూపంలోనే మరో 3 వేల కోట్ల రూపాయలు ఆదాయం పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates