ఏ రాజకీయ పార్టీకి అయినా ట్రబుల్ షూటర్ తప్పనిసరి.! అధినేత కనుసన్నల్లో, అధినేత ఆదేశాల్ని తు.చ. తప్పకుండా పాటించేలా ఆ ట్రబుల్ షూటర్ పనిచేయాల్సి వుంటుంది. పార్టీలో ఎక్కడన్నా ఏదన్నా సమస్య వస్తే, అధినేత వరకూ ఆ సమస్య వెళ్ళకుండా పరిష్కరించగలిగేంత చాతుర్యం ఆ ట్రుబల్ షూటర్‌కి వుండి తీరాలి.
ఔను, జనసేన పార్టీకి ఇప్పుడు ఖచ్చితంగా ఓ ట్రబుల్ షూటర్ అవసరం.! ఎన్నికల వేళ టిక్కెట్ల పంచాయితీ నేపథ్యంలో, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు, అన్ని నియోజకవర్గాల్లోనూ సమస్యల్ని అధినేతే పరిష్కరించాలంటే, అది కుదిరే పని కాదు.!
21 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 లోక్ సభ నియోజకవర్గాల్లో మాత్రమే జనసేన పార్టీ పోటీ చేస్తోంది. అన్ని చోట్లా సమస్యలు లేవు. కొన్ని చోట్ల సమస్యలు తీవ్రంగా వున్నాయి. ఒకటొకటిగా ఆ సమస్యల్ని జనసేనాని పరిష్కరించుకుంటూ వెళుతున్నారు.
తిరుపతిలో పంచాయితీ ఒకింత ఇబ్బందికరంగా మారడంతో, నిన్ననే జనసేనాని తిరుపతికి వెళ్ళి, అక్కడి వ్యవహారాన్ని ‘సెట్’ చేసిన సంగతి తెలిసిందే. మెగాబ్రదర్ నాగబాబు ఎన్నికల్లో పోటీ చేయడంలేదు కదా.? ఆయనైనా సమస్యని పరిష్కరించి వుండాలి కదా.? అదే జరగలేదిక్కడ.
వాస్తవానికి, నిన్న మొన్నటిదాకా నాదెండ్ల మనోహర్ అన్నీ చూసుకునేవారు. కానీ, ఆయనిప్పుడు, ఎన్నికల బరిలో వున్నారు గనుక, తన ప్రచార వ్యవహారాల్లో తాను బిజీగా వున్నారు. పైగా, పోతిన మహేష్ లాంటి చాలామంది నాయకులు, నాదెండ్ల మనోహర్ మీద తీవ్ర విమర్శలు చేసి, పార్టీకి దూరమయ్యారు.
పదేళ్ళ జనసేన ప్రస్తానంలో, నిఖార్సయిన ట్రబుల్ షూటర్‌ని ఇంకా తయారు చేసుకోలేకపోవడం కాస్త ఆశ్చర్యకరమే.!
Gulte Telugu Telugu Political and Movie News Updates