సీట్ల పంపకం ఎప్పుడో ఓ కొలిక్కి వచ్చేసింది. చిన్నా చితకా మార్పులు చివరి నిమిషంలో వుంటాయా.? అంటే, అప్పటిదాకా సాగదీయాలన్న ఆలోచన టీడీపీ, జనసేన పార్టీల్లో అస్సలు కనిపించడం లేదు. బీజేపీ విషయంలోనే ఇంకా కొంత కన్‌ఫ్యూజన్ వుంది. బీజేపీ అభ్యర్థులు గ్రౌండ్ లెవల్‌లో ఆశించిన మేర, ఎన్నికల ప్రచారంలో దూకుడు ప్రదర్శించలేకపోతున్నారు.
ఇదిలా వుంటే, మూడు పార్టీల మధ్యా ఓటు ట్రాన్స్‌ఫర్ విషయమై మొదట్లో చాలా అనుమానాలుండేవి. అప్పటికి కూటమిలోకి బీజేపీ ఇంకా రాలేదు. టీడీపీ – జనసేన మధ్యనే ఓటు ట్రాన్స్‌ఫర్ సజావుగా జరుగుతుందా.? లేదా.? అన్న ఆందోళన ఇరు పార్టీల్లోనూ వుండేది. సీట్ల పంపకాలు కూడా జరగకముందు పరిస్థితి ఇది.
అయితే, క్రమక్రమంగా ఇరు పార్టీలకు చెందిన శ్రేణులు సర్దుకుపోవడం మొదలు పెట్టాయి. అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పదే పదే తమ తమ పార్టీల శ్రేణులకు చేసిన సూచనలు ఫలించాయి. ఇంకోపక్క, వైసీపీ నుంచి కూటమి మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలు కొనసాగుతూనే వున్నాయి.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనూ, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోనూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పర్యటనల సందర్భంగా, ఇరువురూ పరస్పరం గౌరవించుకోవడం, ఒక పార్టీని ఇంకో పార్టీ ప్రమోట్ చేసుకోవడం.. ఇవన్నీ ఇరు పార్టీల శ్రేణుల్లోనూ వున్న కాస్తో కూస్తో పొరపచ్చాలు కూడా తొలగిపోవడానికి కారణమయ్యాయి.
తాజాగా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిర్వహించిన ఉమ్మడి రోడ్ షోలు, బహిరంగ సభలు, రెండు పార్టీల శ్రేణుల్లోనూ కొత్త ఉత్సాహాన్ని నింపాయి. అయితే, చివరి వరకు.. అంటే, ఎన్నికల పోలింగ్ వరకూ.. మూడు పార్టీల కార్యకర్తల మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఆయా పార్టీల ముఖ్య నేతలు, అధినేతలూ జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది.
చిన్న చిన్న విషయాలపై సోషల్ మీడియా వేదికగా, తమ మెయిన్ స్ట్రీమ్ వేదికగా వైసీపీ అనుకూల మీడియా చేస్తున్న దుష్ప్రచారం, కూటమికి ఓటు ట్రాన్స్‌ఫర్ విషయంలో చిక్కులు తెచ్చిపెట్టే అవకాశాలూ లేకపోలేదు.!