ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం నియోజకవర్గం ఆసక్తి రేపుతోంది. ఎందుకంటే ఇక్కడ ఎంతో అనుభవం ఉన్న సీనియర్ మంత్రిని కేవలం సర్పంచ్‌గా మాత్రమే పని చేసిన జూనియర్ నాయకుడు ఢీ కొట్టడమే కారణం. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం.. అయిదు సార్లు ఎమ్మెల్యేగా విజయం.. మంత్రిగా కీలక బాధ్యతలు.. ఇలాంటి నేపథ్యం ఉన్న ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం నుంచి బరిలో ఉన్నారు. ఆయన ఎనిమిదో సారి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. మరోసారి గెలుపు ఖాయమనే ధీమాతో ఈ వైసీపీ నాయకుడు ఉన్నారు.
ఇక మరోవైపు టీడీపీ నుంచి యువ నాయకుడు గొండు శంకర్ సమరానికి సై అంటున్నారు. ధర్మాన ప్రసాదరావుతో పోరుకు సై అంటున్నారు. శంకర్‌కు కేవలం సర్పంచ్‌గా పనిచేసిన అనుభవం మాత్రమే ఉంది. తెలుగుదేశం పార్టీలో క్రమంగా ఎదుగుతున్న శంకర్ ఇప్పుడు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్నారు. ఇక్కడ దశాబ్దాల అనుభవం ఉన్న మరో సీనియర్ నేత, మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ కుటుంబాన్ని టీడీపీ పక్కనపెట్టడం విశేషం. ఇక్కడ ధర్మానకు షాక్ ఇవ్వాలంటే యువ నాయకుడే కావాలంటూ శంకర్‌కు బాబు ఛాన్స్ ఇచ్చారు.
ఇక్కడ ధర్మాన ప్రసాదరావును ఎన్నికల క్షేత్రంలో ఎదుర్కోవడం అంత సులువు కాదు. ముందుగా టీడీపీ క్యాడర్ శంకర్‌కు అండగా నిలవాల్సి ఉంది. గుండ కుటుంబం మద్దతుగా నిలిస్తే శంకర్‌కు పరిస్థితులు కలిసొస్తాయి. శ్రీకాకుళంలో ఆ కుటుంబానికి గొప్ప ఫాలోయింగ్ ఉంది. మరోవైపు మహామహా నాయకులనే ఎదుర్కొని గెలిచిన ధర్మాన ఈ సారి తేలిగ్గానే విజయం సాధిస్తాననే నమ్మకంతో కనిపిస్తున్నారు. ఇక్కడ చరిత్ర చూసుకుంటే ఆరు సార్లు టీడీపీ గెలిచింది. మూడు సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. వైసీపీ ఒకసారి నెగ్గింది. ఇక్కడ వేర్వేరు పార్టీల తరపున నెగ్గిన ధర్మాన.. మరోసారి వైసీపీ జెండా ఎగరేస్తారేమో చూడాలి. లేదంటే యువ నేత శంకర్ చేతిలో భంగపాటుకు గురవుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది.