జనసేన పార్టీ తరఫున అంబటి రాయుడు సిద్ధం.!

కొద్ది రోజుల క్రితం క్రికెటర్ అంబటి రాయుడు, ‘సిద్ధం’ అంటూ ట్వీటేశాడు. ‘ఏంటీ, మళ్ళీ అంబటి రాయుడు వైసీపీలోకి వెళ్ళిపోతున్నాడా.?’ అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. క్రికెట్‌కి గుడ్ బై చెప్పి, రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అంబటి రాయుడు, తొలుత వైసీపీలో చేరాడు. వైసీపీ నుంచి గుంటూరు లోక్ సభ టిక్కెట్ ఆశించినట్లుగా ప్రచారం కూడా జరిగింది.

వైసీపీ గుంటూరు అభ్యర్థి అంబటి రాయుడు.. అంటూ వైసీపీ నేతలే మీడియాకి లీకులు ఇచ్చారు. వైసీపీ సోషల్ మీడియా విభాగం కూడా ఇదే ప్రచారం చేసింది. ఏమయ్యిందో అంబటి, వైసీపీని వీడారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో టచ్‌లోకి వచ్చారు.

మరోపక్క, క్రికెట్ లీగ్ నేపథ్యంలో రాజకీయాలకు అంబటి రాయుడు రిటైర్మెంట్ ప్రకటించడం గమనార్హం. ఇదంతా చాలా చాలా గందరగోళానికి కారణమయ్యింది కూడా.! ఇంతలోనే, జనసేన పార్టీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా అంబటి రాయుడికి అవకాశం దక్కింది.

నాగబాబు, హైపర్ ఆది, అంబటి రాయుడు తదితరులతో కూడిన స్టార్ క్యాంపెయినర్ల లిస్టుని జనసేన పార్టీ తాజాగా ప్రకటించింది. అసలంటూ అంబటి, జనసేన పార్టీలో చేరనే లేదు కదా.? అని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. జన సైనికుల్లోనూ ఈ విషయమై కొంత ఆందోళన వుంది.

పోతిన మహేష్ వ్యవహారం తర్వాత, జనసైనికులు ఎవర్నీ నమ్మే పరిస్థితుల్లో లేరు. అంబటి రాయుడు గనుక కీలక సమయంలో ప్లేటు ఫిరాయించేస్తోనో..? అన్న అనుమానం జనసైనికుల్ని కొంత ఇబ్బంది పెడుతోంది. ఇంతకీ, అంబటి రాయుడు మనసులో ఏముంది.? అదైతే ఇప్పుడే చెప్పలేం.

కాగా, జనసేన తరఫున ఎన్నికల ప్రచారం అంటే, కూటమి తరఫున కూడా అంబటి రాయుడు ప్రచారం చేయాల్సి రావొచ్చు. చేస్తాడేమో కూడా.!