ఏపీలో వలంటీర్ల వ్యవస్థ.. ప్రజలతో మమేకమైపోయింది. ఇది కాదన్నా.. నిజం. అందుకే.. ఆదిలో వలంటీ ర్లపై విమర్శలు చేసిన ప్రధాన ప్రతిపక్షాలు కూడా.. తర్వాత వెనక్కి తగ్గాయి. వలంటీర్లలో తప్పులు చేసే వారు ఉన్నారు. దీనిని కూడా ఎవరూ కాదనరు. అలాగని అసలు వ్యవస్థపైనే మరకలు వేసేప్రయత్నం చేసినప్పుడు ప్రజలు హర్షించలేదు దీంతో చంద్రబాబు సహా.. జనసేన అధినేత పవన్ కూడా వెనక్కి తగ్గారు.
అంతేకాదు.. చంద్రబాబు ఏకంగా తాము అధికారంలోకివచ్చాక కూడా వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పారు. వారికి నెలనెలా రూ.50 వేలు ఆదాయం వచ్చేలా చేస్తామని వాగ్దానం చేశారు ఇక, పవన్ కూడా.. తాను వలంటీర్ల వ్యవస్థకు వ్యతిరేకం కాదని.. ఎవరో ఒకరిద్దరు చేసిన తప్పులు అందరికీ అంటుతున్నా యని వ్యాఖ్యానించారు. మరోవైపు.. వైసీపీ ప్రస్తుత ఎన్నికలలో వలంటీర్లపైనే ఆధారపడింది. వారి ద్వారా ప్రజలను మచ్చిక చేసుకుంది.
ఇలాంటి సమయంలో ప్రతిపక్షాలు చేసిన విమర్శలను వైసీపీ ప్రజల్లోకి తీసుకువెళ్లింది. వలంటీర్లకు.. చంద్రబాబు, పవన్ వ్యతిరేకులని, రేపు ప్రభుత్వం మారితే.. వలంటీర్ వ్యవస్థ ఉండదని.. ఇది మీకు ఇబ్బందులు తెస్తుందని కూడా ప్రజల మనసుల్లో నాటుకునేలా చేసింది. దీనిని చంద్రబాబు కానీ, పవన్ కానీ. పూర్తిస్థాయిలో గ్రహించలేక పోయారు. దీంతో కూటమి అధికారంలోకి వస్తే.. వలంటీర్లను తీసేస్తారనే చర్చ గ్రామీణ ప్రాంతాల్లో జరిగింది. జరుగుతోంది కూడా.
ఇదిలావుంటే.. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం వలంటీర్లను ఎన్నికలకు దూరం చేసింది. దీనిలో చంద్రబాబు, పవన్ ల ప్రమేయం లేదనేది ఆ రెండు పార్టీల వాదన. కేవలం మాజి ఐఏఎస్ , ఐపీఎస్ అధికారులు సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ(సీఎఫ్‌డీ)గా ఏర్పడి వలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు. దీంతో వారిని ఎన్నికల విధులకే కాదు.. అసలు ఏ పనికీ వాడొద్దని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది.
అయితే.. తెరచాటున ఏం జరిగిందనేది సామాన్యులకు తెలియదు. పైకి మాత్రం చంద్రబాబు, పవన్‌లే కనిపిస్తున్నారు. ఈ విషయాన్నే వైసీపీ కూడా ఇప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్తోంది. ఫలితంగా.. వలంటీర్లపై మనసు పెట్టుకున్న ప్రజలు.. టీడీపీ, జనసేనలపైనే అక్కసుగా ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.