తీహార్ జైల్లో కేజ్రీ..క్రేజీ రికార్డు!

ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈడీ అధికారుల కస్టడీలో విచారణలో ఉన్న కేజ్రీవాల్ ను ఈ రోజు కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ కు బెయిల్ నిరాకరించిన కోర్టు ఆయనకు 15 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ ను ఢిల్లీ పోలీసులు తీహార్ జైలుకు తరలించారు. ఈ క్రమంలోనే తీహార్ జైలుకు జ్యుడీషియల్ రిమాండ్ పై వెళ్లిన తొలి ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ చరిత్రపుటలకెక్కారు. తీహార్ జైల్లో కేజ్రీ..క్రేజీ రికార్డు క్రియేట్ చేశారు.

అయితే, కేజ్రీవాల్ జైలు నుంచి పాలన కొనసాగిస్తారా లేదంటే ఆయన తన పదవికి రాజీనామా చేస్తారా అన్న సందిగ్ధత ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ ఈ వ్యవహారం పై కీలక ప్రకటన చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయబోరని, జైలు నుంచే ఆయన ప్రభుత్వాన్ని నడుపుతారని మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఈ కేసులో మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్ లను బీజేపీ టార్గెట్ చేసిందని ఆప్ నేత జాస్మిన్ అన్నారు. ఏడాదిన్నర క్రితం విజయ్ నాయర్ చెప్పిన స్టేట్మెంట్ను ఇప్పుడు ఎందుకు బయటకు బీజేపీ తెస్తుందో ప్రజలు గమనించాలని కోరారు.

మరోవైపు, జైల్లో చదువుకునేందుకు రామాయణం, భగవద్గీత ఏర్పాటు చేయాలని కోర్టుకు కేజ్రీవాల్ అభ్యర్థించారు. దాంతోపాటు జర్నలిస్టు నీరజా చౌదరి రాసిన ‘హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్’ పుస్తకం అందుబాటులో ఉంచాలని ఆయన కోరారు. ఒక బల్ల, కుర్చీ, మెడిసిన్, డైట్ ప్రకారం ఆహారం అందించాలని విజ్ఞప్తి చేశారు.