నా సెక్యూరిటీ ఆఫీస‌ర్ మాటకు క‌న్నీళ్లు తిరిగాయి: చంద్ర‌బాబు

టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు. “నా సెక్యూరిటీ ఆఫీస‌ర్ నాకో మాట చెప్పాడు. ఆ మాట విన్నాక నా క‌ళ్ల‌లో నీళ్లు తిరిగాయి. జ‌గ‌న్ పాల‌న‌లో రాష్ట్రం గంజాయి వ‌నంగా మారిపోయింది. దీనికి బానిస‌లై.. అనేక మంది యువ‌కులు జీవితాల‌ను పాడు చేసుకుంటున్నారు” అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం క‌డ‌ప జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయ‌న ప్ర‌జాగ‌ళం పేరుతో నిర్వ‌హిస్తున్న ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ..

“నిన్న నా సెక్యూరిటీ ఆఫీసర్ ఒక్క మాట చెప్పాడు. సార్… చాలా బాధతో చెబుతున్నా.. మీరేం చేస్తారో తెలియదు.. రాష్ట్రంలో గంజాయి అత్యంత ప్రమాదకర అంశంగా మారింది సార్.. పిల్లలు తెలిసో, తెలియకో దీనికి బానిసలైపోతున్నారు… వాళ్ల జీవితాలు నాశనం అయిపోతున్నాయి సార్… నాకు తెలిసిన ఓ ఉదాహరణ చెబుతాను సార్ అని ఒక మాట చెప్పాడు. ఇది విజయవాడలో జరిగిన ఒక యథార్థ సంఘటన. ఇలాంటివి కొన్ని లక్షలు ఉన్నాయి.

విజయవాడలో బీసీ వర్గానికి చెందిన వ్యక్తి సెలూన్ పెట్టుకుని బతుకుతున్నాడు. భార్య ఒక చిన్న ఉద్యోగం చేస్తూ నెలకు రూ.30 వేలు సంపాదిస్తున్నారు. ఓ కాలనీలో అద్దెకు ఉంటున్నారు. ఆ కాలనీలోకి గంజాయి వాడకం ప్రవేశించింది. వాళ్ల అబ్బాయికి కూడా గంజాయి అలవాటైంది. అదొక వ్యసనంలా మారిపోయింది. దాంతో ఆ దంపతులు తమ పిల్లవాడ్ని హాస్టల్ లో చేర్చితే బాగుపడతాడు అని ఆలోచించారు. ఆ కుర్రాడ్ని హాస్టల్ లో చేర్చారు. కానీ, గంజాయికి బానిసైన ఈ కుర్రాడు హాస్టల్ నుంచి పారిపోయి ఎక్కడెక్కడో తిరిగాడు. తిరిగి ఇంటికి వచ్చాడు. ఇంట్లో వాళ్లు కట్టడి చేయడంతో, డబ్బుల కోసం ఇంట్లోనే దొంగతనం చేయడం మొదలుపెట్టాడు. ఆ డబ్బులతో గంజాయి తాగేవాడు. దాంతో, ఆ అబ్బాయిని హైదరాబాదులోని ఓ పునరావాస కేంద్రంలో చేర్చి రూ.5 లక్షలు ఖర్చు చేశారు. చేతికందిన బిడ్డ ఆ విధంగా నాశనమైపోతే ఆ తల్లిదండ్రులు ఎంత వేదన అనుభవించి ఉంటారో చూడండి. రేపు మీ బిడ్డలు కూడా అలాగే అయిపోతే పరిస్థితి ఏంటి?” అని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు.

రాష్ట్రంలో జే బ్రాండ్ మద్యంతో ప్రజల జీవితాలను, ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నారని చంద్ర‌బాబు విమ‌ర్శించారు. “నేను అధికారంలో ఉన్నప్పుడు ఒక మద్యం సీసా రూ.60 ఉంటే… ఇప్పుడెంతకు అమ్ముతున్నారు? అది తాగినా కిక్ రాకపోతే, మళ్లీ ఇంకో క్వార్టర్ తాగుతున్నారు. ఆ విధంగా రోజుకు రూ.400 ఖర్చు చేస్తున్నారు. తిండి లేక, ఇల్లు గడవక మీ కుటుంబం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించండి!” అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.