బీజేపీ అధిష్టానం తాజాగా.. ఆరు పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. వీరిలో ఒక్క నరసాపురం పార్లమెంటు స్థానం టికెట్‌ను దక్కించుకున్న భూపతిరాజు శ్రీనివాసవర్మ తప్ప.. మిగిలిన వారంతా.. ఏడాది, లేదా రెండేళ్ల కిందట(ఒక్క పురందేశ్వరి మినహా. ఈమె 2019 ఎన్నికలకు ముందు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు) పార్టీలోకి వచ్చిన వారే. అయినప్పటికీ.. వీరికి పార్టీ కీలకమైన ఎంపీ స్థానాలను కట్టబెట్టింది. వీరిలో వివాదస్పద నాయకురాలుగా పేరున్న కొత్తపల్లి గీతకు ఏకంగా అరకు స్థానం ఇచ్చారు.
ఇక, తెలంగాణలో ఉంటూ.. ఏపీలో టికెట్ సంపాయించుకున్నారు మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి. ఈయన రాజంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఇక, టీడీపీ నుంచి 2020లో బీజేపీలో చేరిన సీఎం రమేష్‌కు అనకాపల్లి పార్లమెంటు స్థానం ఇచ్చారు. ఈయన ఇక్కడ నాన్‌లోకల్.అయితే.. వెలమ నాయుళ్ల కులం కావడం.. విజయనగరం, శ్రీకాకుళంలలో ఈ కమ్యూనిటీ ఎక్కువగా ఉండడంతో ఈ సీటును ఆయనకు కేటాయించారనే చర్చ సాగుతోంది.
ఇక, తిరుపతి పార్లమెంటు స్థానం మరీ క్యామెడీ అయిపోయిందని బీజేపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. నిన్నటి వరకు వైసీపీలో ఉన్న గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్‌ను తీసుకువచ్చి.. తిరుపతి సీటు ఇచ్చారు. కానీ, ఈయనకు బీజేపీ నేతలతో ఎక్కడా టచ్ లేదు. కనీసం మాటలు కూడా లేవు. అయినా.. వరప్రసాద్‌కు ఇచ్చారు. దీంతో వీరి గెలుపు ఎలా? అనేది పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వీరంతా బలమైన సంపన్నులే అయినా.. సొమ్ములు ఖర్చు పెట్టేందుకు పెద్దగా ముందుకు వచ్చే పరిస్థితి లేదు.
దీంతో బీజేపీ టికెట్లు ఇచ్చినా.. క్షేత్రస్థాయిలో వీరితో కలిసి నడిచే నాయకులు లేకపోవడం గమనార్హం. అరకులో కొత్తపల్లిగీతను ఎస్టీ సామాజిక వర్గం నాయకులు ఎప్పుడో దూరం పెట్టారు. ఈమె చంచెల స్వభావమే ఈమెను ప్రజలకు దూరం చేసింది. వైసీపీలో గెలిచిన తర్వాత.. 2014లో అప్పటి ప్రతిపక్ష నాయకుడు జగన్‌కు కనీసం మొహం కూడా చూపించకుండా టీడీపీకి జై కొట్టింది. తర్వాత. సొంత పార్టీ పెట్టుకుంది. ఆ తర్వాత.. దీనిని బీజేపీలో విలీనం చేసింది. ప్రజలు ఆమెకు మద్దతివ్వడం కష్టమనే వాదన వినిపిస్తోంది. ఇలా.. అభ్యర్థులను ప్రకటించిన.. గెలుపు గుర్రాలు ఎక్కడం కష్టమనే వాదన వినిపిస్తోంది.