జనసేన పార్టీ నుంచి 18 మంది అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇంకో మూడు నియోజకవర్గాలకు అభ్యర్థులు ఖరారు కావాల్సి వుంది. ఓ ఎంపీ అభ్యర్థి పేరు మాత్రమే ఖరారైంది. ఇంకో ఎంపీ సీటుకు అభ్యర్థి ఎవరన్నది తేలాల్సి వుంది.
38 అసెంబ్లీ ప్లస్ 6 లోక్ సభ నియోజకవర్గాలు పొత్తులో భాగంగా జనసేనకు వస్తాయని తొలుత ప్రచారం జరిగింది. 24 అసెంబ్లీ 3 లోక్ సభ సీట్లకు లెక్క తేలింది. అందులోంచి, మళ్ళీ మూడు అసెంబ్లీ, ఒక లోక్ సభ నియోజకవర్గాన్ని జనసేన త్యాగం చేయాల్సి వచ్చింది.
ఇప్పుడు ఇంకో సారి జనసేన త్యాగం చేయక తప్పదా.? ప్రకటించిన 18 అసెంబ్లీ నియోజకవర్గాలతో సరిపెట్టుకోవాల్సిందేనా.? ఓ ఎంపీ సీటుతోనే జనసేన సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తోందా.? అన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అయితే, మచిలీపట్నం లోక్ సభ నియోజకవర్గం విషయమై జనసేనలో మల్లగుల్లాలు నడుస్తున్నాయి. సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి (వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చారు) బాగా సౌండ్. అయితే, ఆయన్ని అసెంబ్లీకి పంపాలని జనసేన భావిస్తోందిట. బాలశౌరి కూడా అదే అభిప్రాయంతో వున్నారని అంటున్నారు.
ఇంకోపక్క, నాగబాబు మచిలీపట్నం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం వున్నా, అది నిజం కాదని జనసేన పార్టీ నుంచి స్పష్టంగా అందుతున్న సమాచారం. ఆ సీటు, రఘురామకృష్ణరాజుకి ఇచ్చేయొచ్చు కదా.? అంటూ, టీడీపీ – బీజేపీ నుంచి జనసేనపై ఒత్తిడి పెరుగుతోందిట.
21 అసెంబ్లీ, రెండు లోక్ సభ సీట్లలో జనసేన పోటీ చేస్తుందనీ, అదనంగా ఒకటో రెండో అసెంబ్లీ సీట్లు జనసేనకు రావొచ్చన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. అందులో ఒకటి పోతిన మహేష్ లేదా సందీప్ పంచకర్ల కోసం అవుతుందని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates