క‌వితకు ఏపీలోనూ బినామీలు!

బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ త‌న‌య‌, ఎమ్మెల్సీ క‌వితను ఇప్ప‌టికే ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణం కేసులో అరెస్టు చేసిన ఈడీ అధికారులు ఆమెను విచారిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఆమె చెబుతున్న వివ‌రాల‌పై అనుమానం వ‌చ్చిన అధికారులు.. తాజాగా ఆస్తుల వివ‌రాలు, క‌డుతున్న ట్యాక్సులు.. ఆదాయం వంటి అనేక విషయాల‌పైనా దృష్టి పెట్టారు. ఈ క్ర‌మంలో ఆమెకు సంబంధించి తెలంగాణ‌లో ఉన్న ఆస్తుల వివ‌రాలు తెలుసుకుంటున్న‌ట్టు స‌మాచారం.

నిజామాబాద్‌లో ఎంపీగా వ్య‌వ‌హ‌రించిన‌ కవిత ఎక్క‌డెక్కడ ఎన్ని ఆస్తులు కొనుగోలు చేశారు? వాటిని ఎవ‌రి పేరుతో పెట్టార‌నే వివ‌రాల‌ను తెలుసుకునే ప్ర‌య‌త్నంలో ఈడీ అధికారులు బిజీ అయ్యారు. అదేవిధంగా రాష్ట్రం స‌హా ఏపీలోనూ ఆమెకు భారీ ఎత్తున ఆస్తులు ఉన్నాయ‌ని అధికారులు భావిస్తున్నారు. ఈ విష‌యాన్ని ఐటీ అధికారుల ద్వారా కూపీ లాగుతున్నారు. అదేవిధంగా ఆమెకు ఏపీలోని ఓ పార్టీకి చెందిన కీల‌క నేత‌లే బినామీలుగా ఉన్నార‌ని స‌మాచారం అందిన‌ట్టు పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది.

అదేవిధంగా కవిత ఏయే వ్యాపారాల్లో భాగస్వామిగా ఉన్నారనే విష‌యాన్ని కూడా ఈడీ అధికారులు తెలుసుకుంటున్నారు. ఈ మధ్య జరిగిన సోదాలతో నిజామాబాద్‌కు లింకులు ఉన్నాయని తెలియవచ్చింది. దీంతో కవిత ఆస్తుల వ్యవహారాలపై సెంట్రల్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో కవితకు ఎక్కడెక్కడ వ్యాపారాలు ఉన్నాయని ఆరా తీసేందుకు ఈడీ రంగం సిద్ధం చేసిందని బీఆర్ ఎస్‌లోనే చ‌ర్చ సాగుతోంది. కవిత భర్త, బంధువులు, కవితకు సన్నిహితంగా ఉండే వారి వివరాలను సైతం వెలికితీస్తున్నారు.

కవిత మేనల్లుడు మేక శరణ్ స‌హా.. వైసీపీకి చెందిన ఏపీ నేత‌ల‌తోనూ ఆమె బినామీ వ్యాపారాలు చేస్తున్న‌ట్టు ఈడీ అధికారులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ఇదిలావుంటే.. ప్ర‌స్తుతపార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో క‌విత‌కు కేసీఆర్ టికెట్ ఇవ్వ‌లేదు.దీంతో ఆయ‌న ఆమె అరెస్టును, విచార‌ణ‌ను ముందుగానే ఊహించార‌ని బీఆర్ ఎస్ నాయ‌కులు అంటున్నారు. అందుకే ఆమెను దూరం పెట్టార‌ని కూడా చెబుతున్నారు.