వచ్చే ఎన్నికల సమరంలో టీడీపీ – బీజేపీ – జనసేన కూటమిదే విజయమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి చెప్పారు. ‘నేను పిఠాపురంలో పోటీ చేస్తుండడంతో వైసీపీ ఎన్నో పన్నాగాలు పన్నుతోంది. జనసేన శ్రేణులు ప్రతీ దశలోనూ అప్రమత్తంగా ఉండాలి. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి. పిఠాపురం నుంచే ఎన్నికల శంఖం పూరిస్తున్నాం. ఎన్నికల కోడ్, ఈసీ నిబంధనలు పాటించడంపైనా జనసైనికులు పూర్తి అవగాహనతో ఉండాలి’ అని జనసేనాని దిశానిర్దేశం చేశారు. మరోవైపు పిఠాపురంపై ఆయన మాస్టర్ ప్లాన్‌ను రెడీ చేసుకున్నారు.
పవన్ కల్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఆయన మూడు రోజులు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. స్థానిక ‘పురుహూతికా’ దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి వారాహి వాహనం నుంచి ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గ నాయకులు, పార్టీ శ్రేణులతో ఆయన భేటీ కానున్నారు. కాగా, పవన్ కల్యాణ్ తాను పిఠాపురం నుంచే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని ఇటీవల ప్రకటించారు. ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన తనకు లేదన్నారు. అయితే.. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.
రంగంలోకి వారాహి వాహనం!
జనసేన అధినేత గత ఏడాది పర్యటన చేసిన వారాహి వాహనంపైనే ఈ దఫా ఎన్నికల్లోనూ ఆయన ప్రచారం చేయనున్నారు. వారాహి వాహనం నుంచి పవన్ ప్రచారం చేస్తారని.. పిఠాపురం కేంద్రంగానే రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయనున్నట్లు పార్టీ తాజాగా తెలిపింది. శక్తిపీఠం కొలువైన స్థలం.. శ్రీపాద వల్లభుడు జన్మించిన ప్రాంతం నుంచే ఎన్నికల శంఖారావానికి ప్రచారం ప్రారంభించాలని పవన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించి వారికి దిశా నిర్దేశం చేశారు.
బాబు దూకుడు!
మరోవైపు, టీడీపీ సైతం ప్రచార వ్యూహాలకు పదును పెడుతోంది. ఇప్పటికే ఆ పార్టీ అధినేత చంద్రబాబు ‘రా..కదలిరా’ సభలతో ప్రజల్లోకి వెళ్లారు. నారా లోకేష్ యువగళం, చంద్రబాబు ప్రజాగళం సభలతో ప్రచారం నిర్వహించారు. ఇటీవల టీడీపీ – బీజేపీ – జనసేన కూటమి నిర్వహించిన చిలకలూరిపేట ప్రజాగళం సభలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. మరోవైపు, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సైతం నిజం గెలవాలి పేరుతో ప్రచారం నిర్వహిస్తున్నారు.రాబోయేరోజుల్లో భువనేశ్వరి మరింత పుంజుకునే అవకాశం ఉందని.. ప్రచార బాధ్యతలు తీసుకుంటారని పార్టీ వర్గాలు చెప్పాయి.