ఎన్డీయేలో ఎందుకు చేరామో చెప్పిన చంద్ర‌బాబు

ఏపీలో బీజేపీతో చంద్ర‌బాబు చేతులు క‌లిపారు. జ‌న‌సేన‌+టీడీపీ+బీజేపీ క‌లిసి సంయుక్తంగా ఎన్డీయే కూట‌మిగా ఏర్పడి.. అసెంబ్లీ , పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్నారు. ఇప్ప‌టికే సీట్లు కూడా పంచేసుకున్నారు. అయితే.. ఈ పొత్తుపై వైసీపీ నాయ‌కులు తీవ్ర‌స్తాయిలో ట్రోల్స్ చేస్తున్నారు. గ‌తంలో బీజేపీ నుంచి టీడీపీ బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు చంద్ర‌బాబు చేసిన విమ‌ర్శ‌ల‌ను సోష‌ల్ మీడియాలో రోజు కోర‌కంగా ప్ర‌చారం చేస్తున్నారు. ఇక‌, న‌రేంద్ర మోడీ చంద్ర‌బాబుపై చేసిన విమ‌ర్శ‌ల‌ను కూడా ప్ర‌చారం చేస్తున్నారు.

తాజాగా ఈ సోషల్ మీడియాలో జ‌రుగుతున్న దుమారంపై చంద్ర‌బాబు స్పందించారు. లోక్ సభ, శాసనసభకు పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను విడుద‌ల చేసిన చంద్ర‌బాబు.. ఈ సంద‌ర్భంగా తాను ఎన్డీయేతో ఎందుకు పొత్తు పెట్టుకున్న‌దీ సంపూర్ణంగా మ‌రోసారి వివ‌రించారు. ఇదే స‌మ‌యంలో త‌మ పొత్తుపై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు కూడా ఆయ‌న దీటుగా జ‌వాబు చెప్పారు. తాను విమ‌ర్శ‌ల‌కు ప‌డిపోయే నాయ‌కుడిని కాద‌న్నారు. అలాగని త‌న‌ను పొగిడించుకోవ‌డం కూడా ఇష్టంలేద‌న్నారు.

ఎవ‌రు ఎన్ని విమ‌ర్శ‌లుచేసినా.. బీజేపీతోనే క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నామ‌ని చెప్పారు. గెలుపుత‌థ్య‌మ‌ని తేలిందికాబ‌ట్టే.. వైసీపీ నాయ‌కులు విష‌ ప్ర‌చారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ఏకైక అజెండాగా ఎన్డీయేలో చేరామని చెప్పారు. పార్లమెంటులో బలమైన గళం వినిపిస్తూ… రాష్ట్రం కోసం పోరాడగల నాయకులనే అభ్యర్థులుగా నిలబెడుతున్నామని తెలిపారు.

పార్లమెంటుకు పోటీ చేసే 13 మంది తెలుగుదేశం అభ్యర్థులను, వీరితో పాటు మరో 11 అసెంబ్లీ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రజాభిప్రాయం మేరకు ఎంపిక చేసి ప్రకటిస్తున్నామని చెప్పారు. ‘ప్రజలారా దీవించండి’ అంటూ ట్వీట్ చేశారు. ఈ కూట‌మి విజ‌యం త‌థ్య‌మ‌ని ప్ర‌జ‌ల ఆశీర్వాదం ఉంద‌ని తేల్చి చెప్పారు. టీడీపీ నాయ‌కులు గతాన్ని మ‌రిచిపోయి.. పోరాట యోధులుగా మారి పార్టీల‌ను గెలిపించాల‌ని పిలుపునిచ్చారు.