ఇడుపులపాయ టు ఇచ్ఛాపురం జ‌గ‌న్ బ‌స్సు యాత్ర‌

వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్ ఎన్నిక‌ల టూర్ ప్రణాళిక సిద్ధ‌మైంది. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వ‌ర‌కు ఆయన బ‌స్సు యాత్ర చేయ‌నున్నారు. సుమారు వ‌చ్చే ఎన్నిక‌ల పోలింగ్‌కు ఒక రోజు ముందు వ‌ర‌కు ఆయ‌న ప్ర‌జ‌ల్లోనే ఉండ‌నున్నారు. తాను స్టార్ క్యాంపెయిన‌ర్‌గా మారి ప్ర‌చారం చేయ‌నున్నారు. దీనికి సంబంధించి వైసీపీ పక్కా ప్ర‌ణాళిక సిద్ధం చేసింది. ‘మేమంతా సిద్ధం’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రను చేపట్టనున్నారు. ఈ నెల 26న లేదా 27 నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర ద్వారా ప్రజలను ఆయ‌న క‌లుసుకోనున్నారు.

ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ దాదాపు 21 రోజుల పాటు ఈ యాత్ర సాగనుందని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్లమెంటరీ స్థానాల పరిధిలోని అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా ఈ యాత్ర సాగనున్నట్లు తెలుస్తోంది. తొలి విడతలో బస్సు యాత్ర, ఆ తర్వాత ఎన్నికల ప్రచార సభలు నిర్వహించనున్నారు. యాత్రలో భాగంగా ప్రతి రోజూ ఒక జిల్లాలో సీఎం జగన్ ప్రచారం నిర్వహిస్తారు. ప్రజలకు త‌న హ‌యాంలో జ‌రిగిన‌ సంక్షేమాన్ని వివరిస్తూ.. వారి నుంచి సూచనలు, సలహాలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. బస్సు యాత్ర, సభలపై పూర్తి వివరాలను రూపొందిస్తున్నారు.

‘వైనాట్ 175’ నినాదంతో సీఎం జగన్ దూసుకెళ్ల‌నున్నార‌ని తాడేప‌ల్లి వ‌ర్గాలు తెలిపాయి. ఇటీవల 175 అసెంబ్లీ, 24 ఎంపీ స్థానాల్లో అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. గత ఎన్నికల్లో 151 స్థానాల్లో గెలుపొందిన జగన్.. ఈసారి 175 నియోజకవర్గాల్లోనూ విజయం సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. ఈ క్ర‌మంలో పార్టీత‌ర‌ఫున పోటీ చేసే అభ్య‌ర్థుల‌ను అనేక వ‌డ‌పోత‌ల త‌ర్వాత ఎంపిక చేసిన‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాలు పేర్కొన్నాయి. పార్లమెంటరీ స్థానాల్లోని అన్ని నియోజకవర్గాలను కవర్ చేసేలా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకూ బస్సు యాత్ర చేపట్టేందుకు సిద్ధమయ్యారు.

ఇప్పటికే రీజియన్ల వారీగా ‘సిద్ధం’ సభలను నిర్వహించారు. ఇప్పుడు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రతో ప్రజలను నేరుగా కలిసి ప్రభుత్వ పథకాలు, జరిగిన మంచిని వివరించనున్నారు. ప్రతి రోజూ ఉదయం ఇంటరాక్షన్.. మధ్యాహ్నం బహిరంగ సభ ఉండనున్నట్లు సమాచారం. కొన్ని నెలల ముందు నుంచే ఆయా నియోజకవర్గాల్లో సామాజిక సాధికార బస్సు యాత్రలతో మంత్రులు, నేతలు ప్రజల్లోకి వెళ్లారు. ఇప్పుడు సీఎం జగనే నేరుగా రంగంలోకి దిగనున్నారు. ఓ వైపు సిద్ధం సభలను కూడా కొన‌సాగించ‌నున్నారు.