‘వైసీపీ మ‌తం పేరుతో రెచ్చ‌గొడుతోంది’

టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ఏపీ అధికార పార్టీ వైసీపీపై నిప్పులు చెరిగారు. ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీ దారుణాల‌కు పాల్ప‌డుతోంద‌ని అన్నారు. మ‌తం పేరుతో చిచ్చు పెట్టి.. ఓట్ల‌ను చీల్చే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని విమ‌ర్శించారు. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ప్రతినిధులు, ముస్లిం సంఘాల నేతలు టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ముస్లింలకు మేలు చేసింది, చేసేదీ తెలుగుదేశం పార్టీనేన‌ని తెలిపారు. అనేక ప‌థ‌కాల‌ను అమ‌లు చేశామ‌న్నారు. రంజాన్ తోఫా, షాదీ ముబార‌క్ వంటి అనేక కార్య‌క్ర‌మాల‌తో మైనారిటీల‌కు అండ‌గా ఉన్నామ‌న్నారు.

అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో రాక్ష‌స పాల‌న‌ను అంత‌మొందించేందుకు, న‌ర‌కాసురుడు వంటి సీఎం జ‌గ‌న్‌ను గ‌ద్దె దింపేందుకు.. తాము బీజేపీతో పొత్తు పెట్టుకుని, ఎన్డీయే కూట‌మిలో చేరామ‌ని తెలిపారు. బీజేపీ కూడా మైనారిటీల‌కు వ్య‌తిరేకం కాద‌న్నారు. బీజేపీని కులం పేరుతో, మ‌తం పేరుతో చూసే రోజులు పోయాయ‌ని.. ప్ర‌స్తుతం అంద‌రికీ ఆ పార్టీ చేరువైంద‌ని.. దేశ‌వ్యాప్తంగా బీజేపీ పుంజుకోవ‌డానికి పార్టీలో తీసుకువ‌చ్చిన సంస్క‌ర‌ణ‌లేన‌ని చంద్ర‌బాబు చెప్పారు. కానీ, తాము బీజేపీతో పొత్తు పెట్టుకోగానే.. వైసీపీ ఒంట్లో వ‌ణుకు పుట్టింద‌న్నారు.

అందుకే, దారుణాల‌కు తెగ‌బ‌డేందుకు వైసీపీసిద్ధ‌మైంద‌ని చంద్ర‌బాబు చెప్పారు. మ‌తం ప‌రంగా ఓట్ల‌ను చీల్చే కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టింద‌న్నారు. ముఖ్యంగా టీడీపీ ఓటు బ్యాంకును దూరం చేసి.. ప్ర‌జ‌ల్లో విచ్ఛిన్న‌క‌ర రాజ‌కీయాలు చేసేందుకు వైసీపీ తెగ‌బ‌డుతోంద‌న్నారు. అన్ని అస్త్రాలు పోయి జగన్ కుల, మత రాజకీయాలపై పడ్డాడని విమర్శించారు. జగన్ ముఖంలో ఓటమి భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని పేర్కొన్నారు. పొత్తుపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

జనసేనతో పొత్తు సమయంలో కుల రాజకీయాలు చేసి జగన్ బోల్తాపడ్డారని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. “బీజేపీతో మా పొత్తు అనంతరం వైసీపీ మత రాజకీయానికి తెరలేపింది. పొత్తు వల్ల మైనారిటీలకు నష్టం కలుగుతుందన్న ప్రచారాన్ని ప్రజలు నమ్మరు. ముస్లిం సంఘాల నేతలు వైసీపీ మత రాజకీయాలను ఎండగట్టాలి. మేం ముస్లింల‌కు క‌డుపులో పెట్టుకుని చూసుకున్నాం” అని చంద్రబాబు అన్నారు. మైనారిటీల‌ను ఏకం చేసి.. పార్టీవైపు మ‌ళ్లించుకునేందుకు మైనారిటీ సంఘాలు క‌లిసిరావాల‌ని పిలుపునిచ్చారు.