అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం తమ్ముళ్ళల్లో టెన్షన్ పెరిగిపోతోందట. కారణం ఏమిటంటే పొత్తులో ఈ సీటును బీజేపీ ఖాతాలోకి వెళిపోతోందని. నియోజకవర్గాన్ని పొత్తులో బీజేపీకి కేటాయించవద్దని నియోజకవర్గంలోని తమ్ముళ్ళు భారీ ర్యాలి నిర్వహించారు. ఒకరకంగా ఇది నిరసన ర్యాలీ అనేచెప్పాలి. బీజేపీకి సీటు ఇవ్వద్దు టీడీపీనే పోటీచేయాలంటు ర్యాలీలో తమ్ముళ్ళు, క్యాడర్ గట్టిగా నినాదాలు చేశారు. ర్యాలీ ప్రధాన ఉద్దేశ్యం బీజేపీ నేత గోనుగుంట్ల సూర్యనారాయణ(వరదాపురం సూరి)కు వ్యతిరేకంగా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.
దీనికి బలమైన నేపధ్యముంది. అదేమిటంటే వరదాపురం సూరి మొదటినుండి చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుల్లో ఒకళ్ళు. ఇలాంటి నేత 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోగానే వెంటనే బీజేపీలోకి వెళ్ళిపోయారు. దాంతో నియోజకవర్గంలో పార్టీని ముందుండి నడిపించే నేత కనబడలేదు. అందుకనే అప్పటికప్పుడు పరిటాల శ్రీరామ్ ను నియోజకవర్గం ఇన్చార్జిగా ప్రకటించారు. శ్రీరామ్ కూడా 2024 ఎన్నికల్లో టికెట్ హామీపైనే బాధ్యతలు తీసుకున్నారని పార్టీవర్గాల సమాచారం. కాబట్టి ఐదేళ్ళు శ్రీరామ్ నానా అవస్తలుపడి పార్టీని నిలబెట్టారు.
పార్టీ కార్యక్రమాల కోసం, ఆందోళనలు, నిరసనల పేరుతో కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టుకున్నారని అంటున్నారు. అలాంటిది ఎన్నికలు దగ్గరకు వచ్చేటప్పటికి టీడీపీ, జనసేనతో బీజేపీ కూడా చేతులు కలిపింది. ఇంకేముంది సీట్ల సర్దుబాటులో ధర్మవరం నియోజకవర్గాన్ని చంద్రబాబు బీజేపీకి వదిలేసినట్లు ప్రచారం జరుగుతోంది. సీట్ల సర్దుబాటులో బీజేపీ పదిసీట్లో పోటీచేయబోతున్నా ఇంతవరకు అధికారికంగా ఒక్క సీటును కూడా బీజేపీ ప్రకటించలేదు. దాంతో పార్టీతో పాటు కూటమిలో గందరగోళం పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలోనే అందుతున్న లీకులతో ఇతర నియోజకవర్గాల్లో లాగే ధర్మవరంలో కూడా టీడీపీ నేతలు, క్యాడర్లో టెన్షన్ పెరిగిపోతోంది.
నియోజకవర్గాన్ని ఎట్టిపరిస్ధితుల్లోను బీజేపీకి ఇచ్చేందుకు లేదని తమ్ముళ్ళంతా భారీ నిరసనలు చేస్తున్నారు. పార్టీ కష్టాల్లో ఉన్నపుడు టీడీపీని వదిలేసిన ద్రోహి అంటు వరదాపురంసూరికి వ్యతిరేకంగా నానా రచ్చచేస్తున్నారు. తనకు కేటాయించిన సీట్లను, అభ్యర్ధులను బీజేపీ అధికారికంగా ప్రకటిస్తే కాని జనాల్లో క్లారిటిరాదు. అప్పుడు సూరి పేరుంటే తమ్ముళ్ళు ఏ రకంగా రియాక్టవుతారన్నది ఆసక్తిగా మారుతోంది. అందుకనే తమ్ముళ్ళల్లో టెన్షన్ పెరిగిపోతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates