‘మీరు తీసేస్తారా? మ‌మ్మ‌ల్ని తీసేయమంటారా?’

ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో రాజకీయ ప్రకటనల హోర్డింగులు, పోస్టర్లు, కటౌట్లను వెంటనే తొలగించాలని ఆదేశించారు. మీరు తీసేస్తారా?లేక మ‌మ్మ‌ల్ని తీసేయ‌మంటారా? అని ఆయ‌న పార్టీలకు క‌బురు పంపారు. స‌రే.. మీరే తీసేసుకోండి! అని ఆన్స‌ర్ ఇస్తే.. పార్టీలు ఇబ్బందుల్లో ప‌డిన‌ట్టే.

ఎందుకంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన హోర్డింగులు, క‌టౌట్లు, బ్యాన‌ర్లు తొల‌గించేందుకు అయ్యే ఖ‌ర్చును ఆయా పార్టీల ఎన్నిక‌ల ఖ‌ర్చు ఖాతాల్లో జ‌మ చేస్తారు. అంటే.. వారికి శ‌రాఘాతంగా మార‌నుంది. దీంతో ఇప్పుడు పార్టీలు ప‌రుగులు పెడుతున్నాయి. రాష్ట్ర సచివాలయ పరిసరాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాల్లో నిబంధనలు కచ్చితంగా పాటించాలని.. రాజకీయ ప్రకటనల కటౌట్లు తొలగించాలని స్పష్టం చేశారు.

ఈ మేరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలుచేయాలి. ఎలక్ట్రానికి సీజర్ మేనేజ్మెంట్ సిస్టంను విస్తృత స్థాయిలో వినియోగించాలి. ‘సీ విజిల్’ ద్వారా అందే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలి.’ అంటూ అధికారులకు నిర్ధేశించారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల అధికారులlతో పాటు అదనపు సీఈవోలు పాల్గొన్నారు.

50 వేల కంటే ఎక్కువ‌గా ఉంటే..

దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఆర్థికపరమైన అంశాల్లో కూడా కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని నిబంధనలు విధించింది. వ్యక్తులెవరైనా తమ వద్ద 50 వేల రూపాయలకు మించి ఉంచుకోరాదని పేర్కొంది. ముఖ్యంగా ప్రయాణ సమయంలో 50 వేల రూపాయలకు మించి నగదు తీసుకువెళ్ళేటట్లైతే దానికి సంబంధించిన ఆధారాలను తనిఖీల సమయంలో అధికారులకు చూపించాల్సి ఉంటుందని పేర్కొంది. ఆధారాలు చూపించని నగదును సీజ్ చేసే అధికారం అధికారులకు ఉంటుందని తెలిపింది.

ఈ నిబంధన శనివారం సాయంత్రం నుంచి ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4వ తేదీ వరకు అమల్లో ఉంటాయని వివరించింది. అత్యవసరాలకు ఎవరైనా నగదు తరలిస్తుంటే దానికి సంబంధించిన రసీదులు వెంట పెట్టుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది. దుకాణాలలో సరకులకు చెల్లించే మొత్తం అయితే ముందస్తు అనుమతి పత్రం ఉండాలని, నగలకు సంబంధించి ఆర్డర్‌ కాపీ, తరలింపు పత్రం తప్పనిసరి అని తెలిపింది.

బ్యాంకులు, నగదు రవాణా సంస్థలకు సంబంధించిన వాహనాలకు సాయంత్రం 6 గంటల వరకు అనుమతి ఉంటుందని పేర్కొంది. ఆసుపత్రుల్లో చెల్లించాల్సిన బిల్లులకు సంబంధించి రోగి ఓపీ పత్రాలు, రసీదులు వెంట ఉంచుకోవాలని, పోలీసులు, ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్న సొత్తును జిల్లాస్థాయిలో ఉండే కమిటీకి అప్పగిస్తారని వివరించింది.