2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ 18వ లోక్ సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించారు. మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. 2019లో కూడా మొత్తం ఏడు దశలలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన శనివారం నుంచి ఎన్నికల కోడ్ దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది. చివరి విడత ఎన్నికలు ముగిసేవరకు ఎన్నికల నియమావళి దేశవ్యాప్తంగా అమల్లో ఉంటుంది. ఎన్నికల కోడ్ ను కచ్చితంగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఎన్నికల సంఘం అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
బీహార్, గుజరాత్, హర్యానా, ఝార్ఖండ్, మహారాష్ట్ర, త్రిపుర, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, తెలంగాణ(కంటోన్మెంట్), హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడులో ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆయా రాష్ట్రాలలో లోక్ సభ ఎన్నికలతో పాటు 26 అసెంబ్లీ స్థానాలలో ఉప ఎన్నికలు నిర్వహిస్తామని రాజీవ్ కుమార్ వెల్లడించారు. వాలంటీర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు ఎన్నికల విధులు పాల్గొనకూడదని స్పష్టం చేశారు. ఏప్రిల్ 1 వరకు ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులకు అవకాశం కల్పించామన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తేదీలు:
ఏప్రిల్ 18న ఏపీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్
మే 13న ఏపీ శాసనసభ, లోక్ సభ ఎన్నికలు
జూన్ 4న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ, ఉప ఎన్నికల, లోక్ సభ ఎన్నికల కౌంటింగ్, ఫలితాలు
మార్చి 20న లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్
మొత్తం ఏడు దశలలో దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు
దేశవ్యాప్తంగా జూన్ 4న లోక్ సభ ఎన్నికల ఫలితాలు
నాలుగో విడతలో ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ..తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు
Gulte Telugu Telugu Political and Movie News Updates