ఏపీ అధికార పార్టీ వైసీపీ బాపట్ల జిల్లాలోని మేదరమెంట్ల శివారు ప్రాంతంలో నిర్వహించిన సిద్ధం నాలుగో విడత, చివరిదైన సిద్ధం సభలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో వైసీపీ కార్యకర్త ఒకరు మృతి చెందగా.. పదుల సంఖ్యలో సభకు వచ్చిన తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో సభలో తీవ్ర అలజడి చెలరేగింది. సిద్ధం సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ.. నాలుగో సభ కావడంతో గత మూడు సభలకు మించి జనాలను తరలించారు. దాదాపు 15 లక్షల మంది వస్తారని టార్గెట్ పెట్టారు. అయితే.. సుమారు 10 లక్షల మంది వచ్చినట్టుతెలుస్తోంది.
అయితే.. సభ ఆరంభం ముందు నుంచి కూడా జనాల తాకిడి ఎక్కువగానే ఉంది. ఇక, సీఎం జగన్ తన ప్రసంగాన్ని పూర్తి చేసుకుని వెళ్లిపోవడంతో ఒక్కసారిగా బయటకు వచ్చేందుకు వైసీపీ కార్యకర్తలు యత్నించారు. ఈ క్రమంలో ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గేటు వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు అస్వస్థతకు గురయ్యారు. చికిత్స కోసం అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు ఒంగోలు బలరాం కాలనీకి చెందిన మురళీగా గుర్తించారు. ఈ యన వైసీపీ కార్యకర్త అని పార్టీ నేతలు తెలిపారు.
మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్‌కి తరలించారు. కాగా ఈ ఘటనతో మృతిచెందిన వ్యక్తి కుటుంబ సభ్యులను ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఇతర నాయకులు వెళ్లి కలిశారు. వారిని ఓదార్చారు. పార్టీ తరఫున సాయం చేస్తామని.. అన్ని విధాలా పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. అయితే.. ప్రతిపక్ష నేతల నుంచి మాత్రం విమర్శలు తప్పలేదు. భారీ ఎత్తున సభ నిర్వహించినప్పుడు కనీసం జాగ్రత్తలు తీసుకోలేదని.. ఇప్పుడు కార్యకర్త ప్రాణాలకు ఎవరు బాధ్యులని టీడీపీ నేతలు ప్రశ్నించా రు. దీనిపై వైసీపీ అగ్రనాయకులు స్పందించాల్సి ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates