తెలంగాణ ప్రతిపక్షం బీఆర్ ఎస్‌కు భారీ షాక్ తగిలింది. పార్లమెంట్ ఎన్నికల వేళ ఆ పార్టీకి చెందిన నలుగురు కీలక నేతలు బీజేపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, జలగం వెంకట్రావు, మాజీ ఎంపీలు గొడెం నగేష్, సీతారాం నాయక్ బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్, లక్ష్మణ్ పార్టీ కండువా కప్పి వారిని ఆహ్వానించారు. వాస్తవానికి వీరు ముందుగానే పార్టీ మారుతారని తెలిసినా.. కేసీఆర్, కేటీఆర్ లేదా హరీష్‌రావుల నుంచి ఎలాంటి స్పందనా లేక పోవడం గమనార్హం.
కాగా, హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో గెలిచిన సైదిరెడ్డి బీఆర్ఎస్‌లో కీలకనాయకుడు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అదే పార్టీ తరఫున పోటీ చేసి.. ఓటమిపాలయ్యారు. ముఖ్యంగా కేటీఆర్‌కు అంత్యంత సన్నిహితుడిగా సైదిరెడ్డికి పేరుంది. ఆయన పార్టీ మారేందుకురెడీ అవుతున్నట్టు తెలిసినా.. కేటీఆర్ మౌనంగా ఉన్నారు. కనీసం ఫోన్ చేసి వారించే ప్రయత్నం కూడా చేయలేదు. అంతేకాదు.. ఎలాంటి హామీ కూడా ఇవ్వలేదు. దీంతో సైదిరెడ్డి పార్టీ మారారు.
ఇక జలగం వెంకట్రావు ఖమ్మం జిల్లాలో కీలక నేత. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా నుంచి ఆయనొక్కరే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలపొందారు. మాజీ సీఎం కేసీఆర్ కు సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. దాంతో అసంతృప్తిలో ఉన్న జలగం వెంకట్రావు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరే కాదు.. రానున్న రోజుల్లో మరికొందరు నేతలు సైతం బీజేపీలో చేరుతారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. బీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరిన సందర్భంగా ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. తెలంగాణలో బీఆర్ఎస్ పని ఖతం అయిపోయిందన్నారు. తెలంగాణలో గతంలో కంటే ఎక్కువ పార్లమెంట్ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎలాంటి ఆరోపణలు లేకుండా మోడీ ప్రభుత్వం దేశం కోసం పని చేస్తోందని తెలిపారు.