ఇదంతా ఎవరి డబ్బు జ‌గ‌న్‌?

సీఎం జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. సిద్ధం పేరుతో నిర్వ‌హిస్తున్న స‌భ‌ల‌కు ప్ర‌జ‌ల సొమ్ములు ఖ‌ర్చు పెడుతున్నార‌ని.. దీనిని అంద‌రూ నిల‌దీయాల‌ని ఆమె అన్నారు. సిద్ధం పేరుతో నిర్వ‌హిస్తున్న స‌భ‌ల‌కు జ‌గ‌న్ గారు 600 కోట్ల‌రూపాయ‌ల ప్ర‌జ‌ల సొమ్మును త‌గ‌ల‌బెడుతున్నారు. ఇది ఆయ‌న జేబులో సొమ్ము కాదు.. ప్ర‌జ‌ల నుంచి ప‌న్నుల రూపంలో వ‌సూలు చేసిన డ‌బ్బులు. దీనిని అంద‌రూ నిల‌దీయాలి అని ఆమె పిలుపునిచ్చారు.

అధికార పార్టీ వైసీపీ ‘సిద్ధం’ సభలతో ప్రభుత్వ ఆదాయాన్ని దోచుకుంటోంది. ఒక్కో సిద్ధం సభకు రూ.90 కోట్లు ఖర్చు చేస్తోందని, మొత్తం ఈ సభల కోసం రూ.600 కోట్లు ఖర్చు పెట్టింది అని ష‌ర్మిల చెప్పారు. ఇదంతా ఎవరి డబ్బు అని ప్రశ్నించారు. విజయవాడలోని ఆంధ్రరత్నా భవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జ‌గ‌న్‌పైనా. వైసీపీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. గ‌త ఎన్నిక‌ల వేళ‌.. ఇచ్చిన హామీల్లో ఒక్క‌టి కూడా అమ‌లు చేయ‌లేద‌ని నిప్పులు చెరిగారు.

‘‘గత ఎన్నికల ప్రచారంలో జగన్‌ ఇచ్చిన మాట మరిచారు. 2.30లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇచ్చిన హామీ ఏమైంది? ఏపీపీఎస్సీ ద్వారా ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు? మెగా డీఎస్సీ అంటూ దగా డీఎస్సీ వేశారు. కావాల్సిన వాళ్లకే వాలంటీర్ల పేరిట ఉద్యోగాలు ఇచ్చారు. ఉద్యోగాలపై మేం నిలదీస్తే తీవ్రవాదుల్లా చూశారు. గృహనిర్బంధాలు, అరెస్టులు చేశారు“ అని ష‌ర్మిల దుయ్య‌బ‌ట్టారు.

ప్రతిపక్షాలకు కనీసం ప్రశ్నించే హక్కు లేదా? అని ష‌ర్మిల ప్ర‌శ్నించారు. కేంద్రంలో బీజేపీ 10 ఏళ్లు అధికారంలో ఉందని, ఇచ్చిన హామీ ప్రకారం 20 కోట్ల ఉద్యోగాలు రావాలని కానీ, కోటి మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదని ష‌ర్మిల అన్నారు. క‌నీసం కేంద్రాన్ని ప్ర‌శ్నించే ద‌మ్ము, ధైర్యం ఈ జ‌గ‌న్‌కు లేద‌న్నారు. తాను ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేయాలనే దానిపై చర్చ జరిగిందని, అన్ని అంశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు.