జగన్ వెన్నుపోటు రాజకీయం చెప్పిన షర్మిల

ఏపీ సీఎం జగన్ పై ఆయన సోదరి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగనన్న కూడా 420 అని, ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడంలో ఆయన విఫలమయ్యారని షర్మిల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రాష్ట్రాభివృద్ధిపై రాజశేఖర్ రెడ్డి గారికి ఉన్న ఆలోచన చంద్రబాబుకు లేదు సరే, రాజశేఖర రెడ్డి రక్తం పంచుకుపుట్టిన జగనన్నగారికి ఉందా అని షర్మిల భావోద్వేగంతో కన్నీటి పర్యంతమై ప్రశ్నించారు.

ఓవైపు బిజెపి మరోవైపు వైసీపీ ఇంకోపక్క టిడిపి ప్రత్యేక హోదా అంటూ ఆంధ్ర ప్రజలను మోసం చేస్తున్నాయని, అది చూసి తనకు బాధగా ఉందని షర్మిల కంటతడి పెట్టారు. మంగళగిరిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో షర్మిల ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఇకనైనా హోదా కోసం పోరాడకుంటే ఎప్పటికీ దక్కదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. నవ్యాంధ్రప్రదేశ్ కు హోదా ఊపిరి అని, కన్నతల్లి వంటి రాష్ట్రానికి జగన్ వెన్నుపోటు పొడిచారని షర్మిల విమర్శలు గుప్పించారు.

ఇచ్చిన మాటను జగన్ మడత పెట్టారని, అలాంటి వ్యక్తి వైఎస్ వారసుడు ఎలా అవుతాడని ప్రశ్నించారు. వ్యక్తిగత కారణాలతో తాను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టలేదని, అదే తన ఎజెండా అయితే 2019లోనే రాజకీయాల్లోకి వచ్చి ఉండే దానినని క్లారిటీనిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదాపై భరోసా ఇచ్చిన ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ అని స్పష్టం చేశారు. ఆయన చెప్పిన మాట వల్ల తాను రాష్ట్ర రాజకీయాల్లో ప్రవేశించానని చెప్పుకొచ్చారు. ఇక, వైసీపీ, టీడీపీ, జనసేనలకు ఓటేస్తే బిజెపికి వేసినట్లేనని షర్మిల చెప్పారు.

మోడీ అంటే తనకు గౌరవం అని పవన్ కళ్యాణ్ అంటున్నారని, ఏపీకి మోడీ ఏం చేశారని గౌరవిస్తున్నారో పవన్ చెప్పాలని షర్మిల నిలదీశారు. హోదా కోసం పోరాడే వాళ్ళు రాష్ట్రంలో లేరు కాబట్టే తాను వచ్చానని అన్నారు. ఉద్యోగాలు లేక యువత ఆత్మహత్యలకు పాల్పడుతోందని, హోదాతోనే రాష్ట్ర ప్రజల, యువత భవిష్యత్తుకు భరోసా ఉంటుందని అన్నారు. రాష్ట్రానికి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చని మోడీ డిఫాల్టర్ కాదా, కేడీ కాదా అని షర్మిల ప్రశ్నించారు.

రాష్ట్రానికి హోదా ఇస్తానని చెప్పి మోసం చేసిన వాడిని కేడీగాక ఇంకేమనాలి, మోసగాడు కాక ఏమనాలి అని ప్రశ్నించారు. మోడీ కేడీ అయితే మోడీ మోసగాడు అయితే చంద్రబాబు గారు కూడా కేడీనే, మోసగాడే, 420నే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేడీనే, 420నే అంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.