మంత్రి నారా లోకేష్.. మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు. మీడియా సహా.. అధికారులకు కూడా చెప్పకుండానే ఎలాంటి కాన్వాయ్ కూడా రాకుండానే.. కేవలం రెండు కార్లతో సదరు పాఠశాలను విజిట్ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా రుచి చూశారు. కొన్నాళ్ల కిందట ఇదే పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం బాగోలేదని.. ఆరోపిస్తూ.. డస్ట్‌బిన్‌లలో వాటిని వేసేశారు.
ఈ దృశ్యాలను స్వయంగా ప్రధానోపాధ్యాయుడు జానీ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో వివాదం పెరిగి.. సర్కారుపై విమర్శలు వచ్చాయి. ఈ పరిణామాల క్రమంలో మంత్రి లోకేష్ ఆకస్మిక తనిఖీ చేసి.. మధ్యాహ్న భోజనం రుచి చూశారు. విద్యార్థులతోనూ ముచ్చటించి వారి సమస్యలు తెలుసుకున్నారు. అయితే.. ఇది ఆ పాఠశాలకు మాత్రమే పరిమితం కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలకు సెగ పెంచేసింది. తరచుగా మంత్రి లోకేష్.. మీమీ నియోజకర్గాల్లో పర్యటించి.. పాఠశాలల పనితీరును పరిశీలించాలని చెబుతున్నారు.
కానీ, కొందరు మాత్రమే పర్యటిస్తున్నారు. మరికొందరు మాత్రం ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారు. ఎప్పుడూ ఉండేదే కదా! అని లైట్ తీసుకుంటున్నారు. ఇదొక్కటే కాదు.. ప్రజాదర్బార్‌లు నిర్వహించాలని చెబుతున్నా.. అలానే వ్యవహరిస్తున్నారు. ఇక, అంతర్గత కలహాలకు అనేక నియోజకవర్గాలు ఆలవాలంగా మారాయి. వీటిని ఎప్పటికప్పుడు లోకేష్ ఖండిస్తున్నారు. అయినప్పటికీ.. నాయకులు లైట్ తీసుకుంటు న్నారు. తాజాగా ఎవరికీ చెప్పకుండానే.. ఆరోపణలు ఎదుర్కొంటున్న పాఠశాలకు లోకేష్ రావడంతో నాయకులు ఉలిక్కిపడ్డారు.
తమ తమ నియోజకవర్గాల్లోనూ ఇలాంటి ఆకస్మిక తనిఖీలు జరిగే అవకాశం ఉందని భావించిన నాయకులు బుధవారం తెలతెలవారుతూనే.. పాఠశాలల బాట పట్టారు. ప్రార్థనా గీతం నుంచి వారు పాఠవాలను పర్యవేక్షించారు. విద్యార్థుల హాజరును తెలుసుకున్నారు. వంటకు వినియోగించే పదార్థాలను పరిశీలిం చారు. అయితే.. ఇది కూడా అన్ని నియోజకవర్గాల్లోనూ కాదు. కొన్నింటికే పరిమితం అయ్యారు. మొత్తంగా నారా లోకేష్ ఆకస్మిక తనిఖీలు పార్టీలో కలవరం రేపాయి. ప్రస్తుతానికి లోకేష్ ఎవరిపైనా సీరియస్ కాకపోయినా.. ముందస్తుగా నాయకులు అలెర్టు కావడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates
